Seasonal Diseases | వానలు మొదలయ్యాయి.. నిర్లక్ష్యం చేస్తే వ్యాధులే..
Seasonal Diseases | వానలు మొదలయ్యాయి.. నిర్లక్ష్యం చేస్తే వ్యాధులే..
సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టే చిట్కాలు మీకోసం..
Seasonal Diseases | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: వేసవి నుంచి వర్షాకాలపు తేమతో కూడిన వాతావరణంలోకి మారడం అనేది మన శరీరంపై తీవ్ర ప్రభావన్ని చూపుతుంది. మారుతున్న సీజన్ కి అనుగుణంగా మన శరీరంలో ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఈ వర్షాకాలంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, టైఫాడ్ వంటి వ్యాధులు అధికంగా ప్రబలే అవకాశం ఉంది. ఈ మార్పుల వల్ల జీరక్రియలో అలాగే రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఎక్కువే.. అయితే సీజనల్ మార్పులను అలసత్వం చేయోద్దని వైద్యులు సూచిస్తున్నారు. మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులతో ఇలాంటి వాటికి చెక్ పెట్టొచ్చని అన్నారు.
బయట ఫుడ్ బంద్..
ముఖ్యంగా మనం బయట దొరికే ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీధుల్లో లభించే చాట్, పునుగులు, కట్ చేసిన పండ్లు లేదా పానీయాలు వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లకు ప్రధాన కేంద్రాలుగా మారతాయి. అలాగే ఆకుకూరల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి.
వేడి.. వేడిగా ఆహారం తినండి..
వర్షాల వల్ల ఆకుకూరల్లో బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వాటిని ఉప్పు నీటిలో కడిగి, పూర్తిగా ఉడికించిన తర్వాతే తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నిల్వ ఉన్న ఆహారాన్ని తినకుండా, ఎప్పటికప్పుడు తాజాగా వండుకుని వేడిగా ఉన్నప్పుడే తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
మన వంటింట్లో ఔషదాలు..
ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో భాగంగా మన దైనందిన అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. వర్షాకాలంలో నీటి ద్వారా వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. కాబట్టి ఇంటిలో తాగే నీటిని ఎప్పుడూ బాగా మరిగించి వడపోసుకోవడం అలవాటు చేసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి అల్లం, వెల్లుల్లి, పసుపు వంటి మన వంటింట్లో ఉండే దినుసులను డైట్‌లో భాగం చేసుకోవాలి. సాయంత్రం వేళల్లో పసుపు పాలు లేదా తులసి కలిపిన టీ తీసుకోవడం వల్ల గొంతు సమస్యలు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
పరిసరాలు శ్రుభంగా ఉంచండి..
చివరగా, మన పరిసరాల పరిశుభ్రత కూడా ఆరోగ్యానికి అంతే ముఖ్యం. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం వల్ల దోమల ఉత్పత్తిని అరికట్టవచ్చు, తద్వారా డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన జ్వరాలకు దూరంగా ఉండవచ్చు. తేమ వల్ల బట్టలు సరిగ్గా ఆరకపోయినా, వాటిని ధరించడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పొడిబారిన దుస్తులనే ధరించడం అలవాటు చేసుకోవాలి. ఆహారపు నియమాలు పాటిస్తూ, పరిశుభ్రతను కాపాడుకుంటే ఈ వర్షాకాలాన్ని మనం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా హాయిగా ఆస్వాదించవచ్చు.
