పర్యావరణ పరిరక్షణకు పచ్చని మొక్కలు..
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ప్రతి ఒక్కరు ప్రకృతిని కాపాడేందుకు పచ్చని మొక్కలు నాటాలని భీమవరం ఎస్ ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతి రాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి మురళీకృష్ణంరాజు సూచించారు. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా కళాశాల ఎన్ఎస్ఎస్, ఉన్నత భారత అభియాన్, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంగణములో మంచి పండ్ల మొక్కలను నాటారు.
అనంతరం కళాశాల డైరెక్టర్ డాక్టర్ జగపతి రాజు, ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణంరాజులు మాట్లాడుతూ.. భూమికి సూర్యునికి మధ్య పచ్చదనం ఉంటే భూమి వేడి ఎక్కదని దీనిని రైతులు సామాన్యులు గమనించాలని సూచించారు. వరి చేలల్లో ఎండు గడ్డిని మిగిలిన వ్యర్థ పదార్థాలను కాల్చడం వలన భూమి పరోక్షంగా వేడి ఎక్కుతుందని, భూమిలో ఉన్న సహజ లవణాలు పూర్తిగా మాడిపోతాయని ఆయన ఆందోళ వ్యక్తం చేశారు. గోదావరి డెల్టాలో గడ్డి కాల్చే సంప్రదాయాన్ని రైతులు విరమించాలని వారు సూచించారు.
భూమిపై 85 లక్షల రకాల జీవరాసులు ఉన్నాయని వాటి వల్లనే ప్రకృతి సమతుల్యత జరుగుతుందని వాటి వాటికి హాని చేసే ఎటువంటి చర్యలు చేపట్ట రాదని పేర్కొన్నారు.అవకాశం ఉన్న ప్రతి చోటా మొక్కల నాటి పర్యావరణాన్ని కాపాడాలని అది మానవాళి చేతిలోనే ఉందని పేర్కొన్నారు. పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ ఇతర వ్యర్ధాలను సముద్రంలోకి వదలడం వలన సముద్రం నీరు కూడా వేడెక్కుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ఆహ్లాదకరన్ని అందించే మొక్కలు నాటి అందరూ పర్యావరణాన్ని కాపాడుదాం అని ప్రతిజ్ఞ చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా రకరకాల పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేసిన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ కృష్ణ చైతన్య అభినందించారు. కార్యక్రమంలో వెట్ సెంటర్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. రఘురాం, ఆర్ అండ్ డిన్ డాక్టర్ టి వంశీ నాగరాజు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ కృష్ణ చైతన్య, సహాయ కోఆర్డినేటర్ డాక్టర్ కే ఎన్ వి సత్యనారాయణ, సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చైతన్య, వెట్ సెంటర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సూరిబాబు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
