కళకళలాడే ఆకుపచ్చ గుడివాడే మన లక్ష్యం

కళకళలాడే ఆకుపచ్చ గుడివాడే మన లక్ష్యం

గుడివాడ, ఆంధ్రప్రభ : ప్రజలందరి సహకారంతో గుడివాడను ఆదర్శవంతమైన, కళకళలాడే ఆకుపచ్చ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ముఖ్యమంత్రి N. Chandrababu Naidu చేపట్టిన సైకిల్ ర్యాలీ స్ఫూర్తితో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ పట్టణంలో సైకిల్‌పై అవగాహన పర్యటన నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పట్టణ వీధుల్లో సైకిల్ తొక్కుతూ ప్రజలకు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాజానికి సైకిల్ వినియోగం ద్వారా గొప్ప సందేశం ఇచ్చారని అన్నారు. అదే స్ఫూర్తితో గుడివాడ వీధుల్లో సైకిల్‌పై పర్యటిస్తున్నట్లు తెలిపారు.

వాహనాల వల్ల పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలంటే వారంలో కనీసం ఒకరోజైనా సైకిల్ వినియోగించాలని ఆయన సూచించారు. అలా చేస్తే గాలి కాలుష్యం తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు.

ప్రతి ఇంటి ముందు, ప్రతి వీధిలో ఒక మొక్క నాటాలని, చెట్ల పెంపకం ద్వారా వర్షపాతం పెరగడంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

పోలవరం, అమరావతి వంటి అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు గ్రీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే రాము తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, పార్టీ నాయకులు రాధాకృష్ణ, అందుగుల యేసుపాదం తదితరులు పాల్గొన్నారు.