ప్రతిష్టాత్మకంగా పుష్కరాలు.. భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం

  • పుష్కర ఏర్పాట్లుపై ఎమ్మెల్యే పరిశీలన

నర్సాపురం, ఆంధ్రప్రభ: రానున్న పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. గురువారం ఆయన కూటమి నేతలు, అధికారులతో కలిసి పట్టణంలో పర్యటించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులుతో చర్చించారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నరసాపురం పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, భక్తుల రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లు, పుష్కర ఘాట్ల అభివృద్ధి, పట్టణ సుందరీకరణ తదితర అంశాల పురోగతిపై వివిధ శాఖలకు చెందిన అధికారులతో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ, రహదారులు, భవనాలు, జలవనరులు, గోదావరి ప్రధాన పనులు, విద్యుత్, పారిశుద్ధ్యం తదితర శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమమే కాకుండా, నరసాపురం పట్టణానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చే మహత్తర సందర్భమని పేర్కొన్నారు. అందువల్ల పుష్కరాలకు అవసరమైన అన్ని అభివృద్ధి పనుల ప్రతిపాదనలను తక్షణమే సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని, మంజూరైన పనులను నిర్దేశిత గడువులో, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల అమలులో ఎలాంటి ఆలస్యం, నిర్లక్ష్యం, సమన్వయ లోపం ఉండకూడదని స్పష్టం చేశారు.

యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలి…

పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు నరసాపురానికి విచ్చేసే అవకాశం ఉన్నందున, వారికి తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, విద్యుత్, వైద్య సదుపాయాలు, విశ్రాంతి కేంద్రాలు, సమాచార సూచికలు, పార్కింగ్ స్థలాలు వంటి అన్ని మౌలిక వసతులు ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా ఎస్‌టీపీల నిర్మాణం, మురుగునీటి శుద్ధి మరియు రీసైక్లింగ్ వ్యవస్థల ఏర్పాటు, ఘాట్ల వద్ద బయో టాయిలెట్ల నిర్మాణం, ప్రధాన రహదారుల అభివృద్ధి, కాలువల ప్రక్షాళన, రిటైనింగ్ వాల్ నిర్మాణం, పుష్కర రేవుల విస్తరణ, ఘాట్ల పటిష్ఠీకరణ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, నిరంతరాయ విద్యుత్ సరఫరా వంటి పనులను యుద్ధ ప్రాతిపదిక చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే నాయకర్ అధికారులతో కలిసి గోదావరి నదీ ప్రాంతం, పుష్కర ఘాట్లు, పట్టణంలోని పలు వార్డులు, ప్రధాన రహదారులు, కాలువల పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి బండ్ సుందరీకరణ, ఆక్రమణల తొలగింపు, రేవుల పటిష్ఠీకరణ, భక్తుల రాకపోకలకు అనువుగా మార్గాల విస్తరణ, రాత్రివేళల్లో విద్యుత్ సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ వ్యవస్థ బలోపేతం, పరిసర ప్రాంతాల అభివృద్ధి వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. గోదావరి తీర ప్రాంతాన్ని కేవలం పుష్కరాల సమయంలోనే కాకుండా, ఏడాది పొడవునా ఆకర్షణీయంగా, పరిశుభ్రంగా, భక్తులకు అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు.

అలాగే అమరేశ్వరస్వామి ఆలయం, కొండాలమ్మ ఆలయం సహా పుష్కరాలకు అనుసంధానమైన దేవాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే , ఆలయాల పరిసరాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలు, దర్శన మార్గాలు, పారిశుద్ధ్య ఏర్పాట్లు, తాగునీటి సదుపాయాలు, క్యూలైన్ల నిర్వహణ, భద్రతా చర్యలు, సమాచార బోర్డుల ఏర్పాటు వంటి అంశాలపై దేవాదాయ శాఖ అధికారులకు సూచనలు చేశారు. పుష్కరాల సమయంలో ఆలయాల వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలి

పట్టణ అభివృద్ధి పనులు కేవలం పుష్కరాల అవసరాలకే పరిమితం కాకుండా, నరసాపురం ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా ఉండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రహదారుల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, కాలువల శుభ్రపరిచే పనులు, తీర ప్రాంత రక్షణ, విద్యుత్ మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సౌకర్యాల కల్పన వంటి అంశాల్లో సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి శాఖ తమ పరిధిలోని పనులను సమన్వయంతో, వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని, అవసరమైన చోట్ల తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

పుష్కరాలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నరసాపురాన్ని పరిశుభ్రమైన, ఆధునిక సౌకర్యాలతో కూడిన, ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడే ఆదర్శ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని బొమ్మిడి నాయకర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు, రాష్ట్ర మత్స్యకర అభివృద్ధి చైర్మన్ కొల్లు పెద్దిరాజు, ఏఎంసి చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని ,పాలూరు బాబ్జి ,వాతాడి కనకరాజు గంటా కృష్ణ, కొప్పాడ కృష్ణవేణి,అంబటి అరుణ మరియు జనసేన టిడిపి బిజెపి నాయకులు జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.