5thJuneeditorial | నిబంధనల అతిక్రమణతో పెరిగిన ప్రాణనష్టం

5thJuneeditorial | నిబంధనల అతిక్రమణతో పెరిగిన ప్రాణనష్టం

5thJuneeditorial | నిబంధనల అతిక్రమణతో పెరిగిన ప్రాణనష్టం
షార్ట్‌సర్క్యూట్ కారణమని ప్రాథమిక దర్యాప్తు
భద్రతా లోపాలు, నిర్లక్ష్యంపై ప్రశ్నలు
విదేశీయుల మృతితో దేశ ప్రతిష్ఠకు దెబ్బ

5thJuneeditorial | ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో బుధవారం సంభవించిన అగ్నిప్రమాదంలో 21 మంది మరణించిన సంఘటన మాటలకు అందనిది. వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు. ఢిల్లీలో ఇటువంటి అగ్నిప్రమాదాలు గతంలోనూ జరిగాయి కానీ, ఇప్పుడు జరిగినది తీవ్రాతి తీవ్రమైనది. ఈ ప్రమాదం సంభవించిన హోటల్‌లో వసతికి ఆరు గదులను మాత్రమే కేటాయించాలి. కానీ 25 గదులను కేటాయించినట్టు తేలింది.

ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అనుమతి ఇచ్చిన దానికన్నా ఎక్కువ గదులను వసతికి కేటాయించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ హోటల్‌లో బస చేసిన వారు ప్రమాదం జరిగినప్పుడు వేరే దారి లేక మంటల్లో చిక్కుకుపోయి అగ్నికి ఆహుతి అయ్యారు.

వేసవి కాలంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదాలు సంభవించడం మామూలే. నగరాల్లోనే ఇవి ఎక్కువగా సంభవిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో, అందునా జనసమ్మర్థంగా ఉండే మాలవీయ నగర్‌లోని హోటల్‌లో ఈ ప్రమాదం సంభవించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ హోటల్‌లో అగ్నిప్రమాద నిరోధక యంత్రాలు లేకపోవడం, ఇందుకు సంబంధించి ప్రత్యేక విభాగం లేకపోవడం మన వ్యవస్థలోని లోపాన్ని ఎత్తిచూపుతోంది.

చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతి కారణంగానే నిబంధనల అతిక్రమణ జరుగుతోందన్నది వాస్తవం. ఈ హోటల్‌కు ఆరు గదుల్లో మాత్రమే వసతికి అనుమతి ఇవ్వగా, 25 గదులను వసతికి కేటాయించారంటే అవినీతియే కారణం అని వేరే చెప్పనవసరం లేదు.

ఢిల్లీలో వివిధ పనులపై వచ్చే వారు ఒక రోజు లేదా రెండు రోజులు బస చేసేందుకు ఇలాంటి హోటళ్లు ఉపయోగపడుతున్నాయి. బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ విధానం కింద ఏర్పాటైన వసతి గదుల్లో బస చేసిన వారే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ పథకం కింద ఈ హోటల్‌కు రెండేళ్ల క్రితం అనుమతి మంజూరు అయింది. వచ్చే ఏడాదితో అది ముగుస్తుంది. ఈ ప్రమాదం కారణంగా ఆ పథకాన్ని రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారు హోటల్ పై నుంచి కిందికి దూకి కొందరు ప్రాణాలు కాపాడుకున్నారు. అలాంటి వారి కోసం హోటల్ భవన సముదాయంలో ఉన్న పరుపుల కంపెనీ ఉచితంగా పరుపులను అందించింది. హోటల్ బేస్‌మెంట్‌లో రెండు కిచెన్లు ఉన్నప్పటికీ, వాటిలో వంట గదుల్లో నిప్పు అంటుకోవడం వల్ల ప్రమాదం సంభవించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.

ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి వాష్‌రూమ్‌లో దాక్కున్న వారు సైతం పొగ వల్ల ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణం ఫలానా వారని నిర్ధారించేందుకు వీలు లేని పరిస్థితి ఏర్పడింది. మృతుల్లో వీల్‌చైర్‌లో పూర్తిగా కాలిపోయిన వ్యక్తి శవం కనిపించింది. అలాగే, రిసెప్షన్‌లో ఉన్న యువతి మృతదేహాన్ని కూడా గుర్తించారు.

మృతుల్లో విదేశీయులు కూడా ఉండటం వల్ల దేశం ప్రతిష్ఠ దెబ్బతింటుంది. ఇది జరిగిన మర్నాడే బీహార్‌లోని ఒక ఆస్పత్రిలో ఐదుగురు రోగులు అగ్నిప్రమాదానికి ఆహుతి కావడం దురదృష్టకరం. మానవ కల్పితమైన కారణం కనిపించనప్పటికీ, నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నది వాస్తవం.