10 వేల ఎకరాల్లో పట్టు సాగుకు భారీ ప్రణాళిక..

10 వేల ఎకరాల్లో పట్టు సాగుకు భారీ ప్రణాళిక..

రైతుల ఆదాయ పెంపుపై కలెక్టర్ ఫోకస్!

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లాలో పట్టుపరిశ్రమ (సెరికల్చర్) అభివృద్ధి, పట్టు రైతుల ఆదాయ పెంపు లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సెరికల్చర్ శాఖ జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.

2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో కొత్తగా 10 వేల ఎకరాల్లో మల్బరీ సాగు విస్తరణ లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ లక్ష్యాలను గ్రామస్థాయి సిబ్బందికి కేటాయించి విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. ఇందులో 4 వేల ఎకరాలను ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్)తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. సాగు విస్తీర్ణమంతా తప్పనిసరిగా ఈ-పంట పోర్టల్‌లో నమోదు కావాలని స్పష్టం చేశారు.

పెనుకొండ డివిజన్‌లో పట్టుసాగు విస్తరణ దృష్ట్యా అదనపు సిబ్బందిని కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఎకరాకు 900 కిలోల పట్టుగూళ్ల దిగుబడి సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని, వాస్తవ సాగు విస్తీర్ణానికి అనుగుణంగా సవరించిన లక్ష్యాలను సమర్పించాలని సూచించారు.

అలాగే హిందూపూర్‌లో నిర్మాణంలో ఉన్న నూతన పట్టుగూళ్ల మార్కెట్ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం

జిల్లాలో పట్టు రైతుల్లో కనీసం 20 శాతం మందిని సహజ వ్యవసాయం వైపు మళ్లించేలా గ్రామస్థాయి సెరికల్చర్ అసిస్టెంట్లకు ప్రత్యేక లక్ష్యాలు నిర్దేశించాలని కలెక్టర్ పేర్కొన్నారు. నేల సారాన్ని పెంపొందించేందుకు ‘ప్రాజెక్ట్ పునరుజ్జీవం’ కింద బయోచార్ కో-కంపోస్టింగ్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు.

నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి

పట్టు తోటల్లో నీటి వినియోగం అధికంగా ఉండటంతో ‘జలధార–జలాహారతి’ కార్యక్రమం ద్వారా నీటి బడ్జెటింగ్ అమలు చేయాలని, డ్రిప్ ఇరిగేషన్, ఫామ్‌పాండ్‌లు, సరిహద్దు కందకాల తవ్వకంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రగతిని సమర్థంగా అంచనా వేసేందుకు రైతుల మోటార్ల విద్యుత్ సర్వీస్ నంబర్లను సేకరించాలని సూచించారు.

ఎఫ్‌పీఓల ఏర్పాటుకు ప్రోత్సాహం

పట్టు రైతులతో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓలు) ఏర్పాటు చేయాలని, ఇందుకోసం నాబార్డ్ రుణాలను వినియోగించుకోవాలని సూచించారు. సమగ్ర పట్టుగూళ్ల ఉత్పత్తి విధానాలపై ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ) సిద్ధం చేయాలని, తక్కువ ఖర్చుతో కూడిన పట్టు పురుగుల పెంపకం షెడ్ల నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు.

క్షేత్రస్థాయి అధికారుల టూర్ డైరీలను క్రమం తప్పకుండా సమర్పించాలని, అర్హులైన రైతుల గుర్తింపును సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు.

రైతుతో నేరుగా మాట్లాడిన కలెక్టర్

సమీక్షా సమావేశం మధ్యలో మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం కరికెర గ్రామానికి చెందిన పట్టు రైతు డి. జంపన్నతో కలెక్టర్ నేరుగా ఫోన్‌లో మాట్లాడారు.

ఐదు ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్న ఆయన కొత్తగా పట్టు పురుగుల పెంపకం షెడ్ నిర్మించుకోవాలనే ఆసక్తిని వ్యక్తం చేయగా, అవసరమైన సాంకేతిక సలహాలు, ప్రభుత్వ సహాయం అందించాలని అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు.

ఈ సమావేశంలో ఎస్. శోభారాణి, హెచ్. హనుమంతరాయ, డి. వెంకటస్వామి నాయక్, జె. హంపయ్యతో పాటు సెరికల్చర్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.