​తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి..

​తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి..

  • బీజేపీ జిల్లా కన్వీనర్ గోపతి రాజయ్య

దండేపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ఇప్పటివరకు సరైన గుర్తింపు దక్కకపోవడం బాధాకరమని బీజేపీ జిల్లా కన్వీనర్ గోపతి రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రత్యేక రాష్ట్రం కోసం రైలు రోకోలు, సకల జనుల సమ్మె, వంట-వార్పు వంటి ఎన్నో నిరసన కార్యక్రమాల్లో పాల్గొని, కేసులు ఎదుర్కొని, కోర్టుల చుట్టూ తిరిగిన ఉద్యమకారులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడవడం దురదృష్టకరమని మండిపడ్డారు.

“నిధులు, నీళ్లు, నియామకాలు అనే నినాదంతో, రాష్ట్రం వస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని ఆశించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో, ఉద్యమకారుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఉద్యమకారులను గుర్తించి వారికి ఫ్రీడమ్ ఫైటర్ సర్టిఫికెట్లు మంజూరు చేయడంతో పాటు, గౌరవ వేతనాలు (పింఛన్లు) అందించి ఆదుకోవాలి” అని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బందెల రవిగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పత్తిపాక సంతోష్, మాజీ సర్పంచ్ గడికోప్పుల రజిని సురేందర్, జాతీయ జెండా కన్వీనర్ మల్యాల రమేష్, మన్ కీ బాత్ కన్వీనర్ దుమ్మని సత్తయ్య, శక్తి కేంద్ర ఇంచార్జ్ చీర్ల వెంకటేశ్వర్లు, దండేపల్లి బూత్ అధ్యక్షులు గొల్ల మల్లేష్, వెల్గనూర్ బూత్ అధ్యక్షులు గౌరీశెట్టి సంతోష్‌లతో పాటు పలువురు నాయకులు,పాల్గొన్నారు.