తెలంగాణ ఉద్యమ వీరులకు ఘన సన్మానం

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసి పోరాడిన తెలంగాణ మలిదశ ఉద్యమకారులను లెంకాలపల్లి గ్రామ పంచాయతీ ఘనంగా సన్మానించింది.గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు ఆకుల సాంబారావు, మామిండ్ల పెద్ద ఐలయ్య, మామిండ్ల చిన్న ఐలయ్యలను గ్రామ సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి–రవీందర్, ఉపసర్పంచ్ కొలిపాక రఘుపతి, వార్డు సభ్యులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు కలిసి శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంపై దశాబ్దాలుగా కొనసాగిన వివక్ష, అన్యాయాలకు వ్యతిరేకంగా వేలాది మంది ఉద్యమకారులు చేసిన నిరంతర పోరాటం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. రాష్ట్ర సాధన కోసం తమ కుటుంబాలను, వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం సాగించిన ఉద్యమకారుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.గ్రామానికి చెందిన ఆకుల సాంబారావు, మామిండ్ల పెద్ద ఐలయ్య, మామిండ్ల చిన్న ఐలయ్య వంటి ఉద్యమ వీరులు తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించడం లెంకాలపల్లి గ్రామానికి గర్వకారణమని ఆమె అన్నారు.వారి సేవలను గ్రామ ప్రజలు ఎప్పటికీ మరువరని కొనియాడారు.