బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి

బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి

చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి
ఎస్పీ సతీశ్ కుమార్

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇందుకు సంబంధిత చట్టాలపై ప్రజలకు పూర్తి అవగాహన ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం–1976పై అవగాహన సదస్సు నిర్వహించారు. రూరల్ అండ్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ సొసైటీ (REDS) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్, ఏఎస్పీ అంకితా సూరన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ బానిస కార్మిక వ్యవస్థ, వెట్టి చాకిరీ వంటి అమానవీయ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల పేరుతో, ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యక్తులను బలవంతంగా పనిచేయించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.

బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం–1976 ద్వారా బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు వారి పునరావాసానికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. వెట్టి చాకిరీకి గురైన వ్యక్తులను గుర్తించి విముక్తి కల్పించేందుకు పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, కార్మిక శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు. బాధితులకు అవసరమైన న్యాయ సహాయం, పునరావాస సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తోందన్నారు.
సమాజంలో అవగాహన పెరిగినప్పుడే ఇటువంటి దురాచారాలను పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం, బాధితులను గుర్తించి రక్షించడం వంటి అంశాల్లో స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. బలవంతపు శ్రమ, బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా వంటి సమస్యలపై కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

జిల్లాలో బానిస కార్మిక వ్యవస్థకు తావులేకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని, ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా పోలీసులను సంప్రదించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచి తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ అవగాహన సదస్సులో వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించి చట్టపరమైన అంశాలు, బాధితుల గుర్తింపు, రక్షణ చర్యలు, పునరావాస కార్యక్రమాలపై నిపుణులు వివరించారు. కార్యక్రమం ద్వారా చట్టంపై అవగాహన పెంపొందడంతో పాటు సమాజంలో బాధ్యతాయుతమైన చైతన్యం కల్పించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.