పర్యాటక ప్రచారానికి గుర్తింపు..
మంగపేట, ఆంధ్రప్రభ : మంగపేట మండలంలోని చెరుపల్లి ( కొత్తపేట ) గ్రామానికి చెందిన గాజుల శ్రవణ్ కుమార్ కు ఉత్తమ కంటెంట్ క్రియేటర్ అవార్డు దక్కింది. టూరిజం అభివృద్ధికి కృషి చేస్తూ ములుగు జిల్లాలో ఉన్న అందమైన ప్రాంతాలను ప్రపంచానికి చాటేలా, పర్యాటక ప్రాంతాల విశిష్టతను ప్రజల్లోకి తీసుకెళ్లిన గాజుల శ్రవణ్ కుమార్ ను ఉత్తమ కంటెంట్ క్రియేటర్ అవార్డు కు ఎంపిక చేశారు.
మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ ( సీతక్క ), ములుగు జిల్లా కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు చేతుల మీదుగా గాజుల శ్రవణ్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. ఉత్తమ కంటెంట్ క్రియేటర్ అవార్డు అందుకున్న గాజుల శ్రవణ్ కుమార్ కు గ్రామస్తులు, బంధు మిత్రులు అభినందనలు తెలిపారు .
