ప్రజాధనాన్ని దోచుకున్న వారిని ఎవరిని వదిలిపెట్టం

ప్రజాధనాన్ని దోచుకున్న వారిని ఎవరిని వదిలిపెట్టం

  • పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రత్యేక అధికారుల పాలనలో పరకాల నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలు అవినీతికి నిలయాలుగా మారాయని, కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగానికి గురైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు.

నియోజకవర్గంలోని సర్పంచులు, ఉపసర్పంచులతో నిర్వహించిన సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలను ఆయన ప్రస్తావించారు. పనులు చేయకుండానే బిల్లులు పొందడం, అక్రమ మొరం తవ్వకాల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం, బతుకమ్మ పండుగ ఏర్పాట్లు లేకుండానే నిధులు డ్రా చేయడం వంటి అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు.

మిషన్ భగీరథ ద్వారా గ్రావిటీ పద్ధతిలో నీటి సరఫరా జరుగుతున్న గ్రామాల్లో మోటార్లు కాలిపోయినట్లు తప్పుడు బిల్లులు సృష్టించడం, కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేయకుండానే చేసినట్లు చూపించడం, ట్రాక్టర్లకు మరమ్మతులు చేయకుండానే రిపేర్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

కొన్ని గ్రామాల్లో ఎంబీ (మెజర్‌మెంట్ బుక్) రికార్డులు లేకుండానే బిల్లులు చెల్లించారని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఆ బిల్లులను చెల్లించాలని ఎంపీడీఓలు, ఎంపీఓలు సర్పంచులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపించారు.

అవినీతికి పాల్పడిన వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చల్లా ధర్మారెడ్డి అన్నారు. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం కొందరు అధికారులు బీఆర్ఎస్‌కు చెందిన సర్పంచులు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజకీయ పక్షపాత ధోరణిని వెంటనే విరమించుకోవాలని హెచ్చరించారు.

ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైన నాటి నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు పరకాల, నడికూడ, ఆత్మకూర్, దామెర, గీసుగొండ, సంగెం మండలాల గ్రామ పంచాయతీల్లో జరిగిన అన్ని పనులు, నిధుల వినియోగం, బిల్లుల చెల్లింపులపై విజిలెన్స్ అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారులు, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు చల్లా ధర్మారెడ్డి తెలిపారు.

Leave a Reply