ఇంటి వద్దే విషాదం.. కుటుంబంలో తీవ్ర శోకం
చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని మొదటి వార్డు శివనేనిగూడెంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతిచెందింది.
స్థానికుల కథనం ప్రకారం, మన్నేబోయిన శివకృష్ణ భార్య పావని (28) ఇంటి వద్ద దండంపై బట్టలు ఆరేస్తుండగా అనుకోకుండా విద్యుత్ షాక్కు గురైంది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే పావని మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
