బెయిల్ ఇప్పిస్తానని.. !!

సూర్యాపేట రూరల్ (ఆంధ్రప్రభ): పోలీసుల పేరుతో బెయిల్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని సూర్యాపేట రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ విషయం గురించి రూరల్ సీఐ రాజశేఖర్ ఆదివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

సీఐ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 22న జనగాం క్రాస్‌రోడ్‌లోని ఓ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఇంటిలో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంపై పోలీసులు దాడి చేసి, నకిరేకల్‌కు చెందిన రవీంద్ర అనే విటుడిని, ఒక మహిళను అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరచగా, జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపారు.

ఈ నేపథ్యంలో, ఆ నిందితుడికి పరిచయం ఉన్న వంగూరి సురేష్ (బండపాలెం గ్రామం, కేతేపల్లి మండలం) అనే వ్యక్తి బెయిల్ ఇప్పిస్తాను అంటూ పోలీసుల, అడ్వకేట్‌ల పేర్లు చెప్పి రవీంద్ర స్నేహితుడి నుండి రూ.70,000 వసూలు చేశాడు.

అయితే, ఎనిమిది రోజుల తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన రవీంద్రను మళ్లీ రూ.60,000 ఇవ్వాలని సురేష్ డిమాండ్ చేయడంతో, రవీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా ఎస్సై వెంకటయ్య కేసు నమోదు చేసి సురేష్‌ను అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్ హెచ్చరిస్తూ.. “పోలీసులు, అడ్వకేట్‌ల పేర్లు చెప్పి ఎవరు ఇలాంటి వసూళ్లకు పాల్పడినా వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.

Leave a Reply