రూ.80 లక్షల విలువ గల చోరీ సొత్తు స్వాధీనం
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: రూ.80 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి తెలిపారు.

సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఇటీవల జరిగిన వరుస దొంగతనాలను కాశీబుగ్గ పోలీసులు సమర్థవంతంగా ఛేదించినట్లు చెప్పారు.
అరెస్టయిన నిందితులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్దా జిల్లా ఇంగ్లీష్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోయస్పూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ మీజాన్ (ఏ-1), మహమ్మద్ హసన్ (ఏ-2)గా గుర్తించారు.
ప్రధాన నిందితుడు మహమ్మద్ మీజాన్ పగటిపూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రెక్కీ నిర్వహించి, రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడేవాడని విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. దొంగిలించిన బంగారం, వెండి, నగదు ఇతర విలువైన వస్తువులను విక్రయించేవాడని వెల్లడించారు.
మహమ్మద్ మీజాన్‌పై గతంలో శ్రీకాకుళం జిల్లాలో 7 కేసులు, విజయనగరం జిల్లాలో 7 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 2 కేసులు నమోదైనట్లు తెలిపారు. వీటిలో కొన్ని కేసుల్లో కోర్టు శిక్ష విధించగా, జైలు శిక్ష కూడా అనుభవించాడని చెప్పారు.
2025 అక్టోబర్‌లో జైలు నుంచి విడుదలైన తర్వాత ఒడిశా రాష్ట్రం బరంపురంలో నివాసం ఉంటూ మళ్లీ నేర కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు.
గత మూడు నుంచి నాలుగు నెలల కాలంలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు, టెక్కలి పరిధిలో ఒక కేసు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక కేసు, ఒడిశా బరంపురంలో ఒక కేసులో వీరి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు.
కాశీబుగ్గ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పలాస మండలం గరుడఖండి గ్రామంలోని జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వారి వద్ద నుంచి 12 తులాల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి ఆభరణాలు, రూ.1,09,350 నగదు, సుమారు రూ.1 లక్ష విలువైన మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం చోరీ సొత్తు విలువ సుమారు రూ.80 లక్షలుగా అంచనా వేశారు.
కేసు ఛేదనలో కాశీబుగ్గ పోలీస్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారని ఎస్పీ ప్రశంసించారు. అదనపు ఎస్పీ (క్రైమ్) పి. శ్రీనివాసరావు, కాశీబుగ్గ డీఎస్పీ టి. భవాని పర్యవేక్షణలో సీఐ వై. రామకృష్ణ, ఎస్‌ఐ ఎన్. సునీల్‌తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
