చిన్నారి ప్రాణాలకు అండగా ప్రభుత్వ చేయూత

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో అందించిన వినతిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, ఓ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు భారీ ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. చాగలమర్రి మండలానికి చెందిన లక్ష్మి ధన్సికకు అవసరమైన బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ (స్టెమ్ సెల్ థెరపీ) చికిత్స కోసం రూ.22 లక్షల ఆర్థిక సహాయం అందించింది.

సోమవారం పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయ ఉత్తర్వులను చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు.

కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, లక్ష్మి ధన్సికకు అత్యవసరంగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉండగా, చికిత్సకు సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. అంతటి వ్యయాన్ని భరించే ఆర్థిక స్థోమత తమకు లేదని చిన్నారి తల్లిదండ్రులు గతంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం సమర్పించారు.

ఈ అంశంపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్, చిన్నారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఆర్థిక స్థితిగతులను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ప్రత్యేక చొరవతో ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి రూ.22 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని సానుకూలంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. చిన్నారి ఆరోగ్యంగా కోలుకుని మంచి భవిష్యత్తుతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

శస్త్రచికిత్సలో భాగంగా అవసరమైన బోన్ మ్యారో కణాలను చిన్నారి తండ్రి నుంచి సేకరిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ, తమ కుమార్తె ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, సమస్యను గుర్తించి సహకరించిన జిల్లా కలెక్టర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆర్థిక సహాయం తమ కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు.

ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో సమర్పించిన అర్జీకి సత్వర స్పందన లభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.