అమ్మవారికి, స్వామికి లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారికి లోకకల్యాణార్థం పంచమఠాలలో సోమవారం విశేష అభిషేకాలు, పుష్పార్చనలు నిర్వహించినట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.

ముందుగా ఘంటామఠంలో, అనంతరం వరుసగా భీమశంకర మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠం, సారంగధర మఠాలలో ఈ పూజాదికాలు నిర్వహించినట్లు చెప్పారు.

విశేష పూజల్లో భాగంగా అర్చక స్వాములు ముందుగా లోకకల్యాణ సంకల్పాన్ని పఠించారు. ఈ సంకల్పంలో దేశం శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలిగి అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని ప్రార్థించారు.

దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు వంటి అనర్థాలు జరగకుండా ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని సంకల్పం చేసినట్లు తెలిపారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని ఘంటామఠంలోని గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని మఠాలలో సంప్రదాయబద్ధంగా అభిషేకాలు, అర్చనలు జరిపినట్లు పేర్కొన్నారు.

శ్రీశైల సంస్కృతిలో మఠాలు అనాదిగా ప్రధాన పాత్ర పోషించాయని ఈ సందర్భంగా వివరించారు. ప్రస్తుత సాధారణ శకం 7వ శతాబ్దం నుంచి నిర్మించబడిన ఈ మఠాలు గర్భాలయం, అంతరాలయం, ముఖ మండపం వంటి నిర్మాణాలతో ఆలయాలను తలపించే విధంగా ఉంటాయని తెలిపారు.

అనేక శతాబ్దాలుగా ఈ మఠాలు క్షేత్ర ప్రశాంతత, ఆలయ నిర్వహణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తులకు సదుపాయాల కల్పనలో కీలక భూమిక పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

శ్రీశైలంలో గతంలో ఉన్న కొన్ని మఠాలు కాలగర్భంలో కలిసిపోయాయని, ప్రస్తుతం ఆలయానికి వాయువ్య దిశలో ఉన్న ఘంటామఠం, భీమశంకర మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠం, సారంగధర మఠాలను కలిపి ‘పంచమఠాలు’గా పిలుస్తున్నారని తెలిపారు.

శిథిలావస్థకు చేరుకున్న ఘంటామఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠాలను దేవస్థానం పూర్తిగా పునరుద్ధరించిందని, ప్రాచీన నిర్మాణ శైలికి ఎలాంటి విఘాతం కలగకుండా పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు.

భీమశంకర మఠానికి కూడా అవసరమైన మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. ఈ మఠాలలోని దేవతామూర్తులకు నిత్య ధూప, దీప, నైవేద్య కైంకర్యాలు నిరంతరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.