భవన నిర్మాణ అనుమతులు ఇక మరింత సులభం

భవన నిర్మాణ అనుమతులు ఇక మరింత సులభం

  • ఏపీడీపీఎంఎస్ 2.0తో వేగవంతమైన సేవలు
  • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు.

కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : భవన నిర్మాణాలు, లేఅవుట్లకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. సోమవారం స్థానిక ఎస్‌బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన పురపాలక, నగరపాలక సంస్థల ప్రణాళికా సిబ్బంది, లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లకు ఏపీ పట్టణాభివృద్ధి శాఖ ప్రవేశపెట్టిన ఏపీడీపీఎంఎస్ 2.0 ఆన్లైన్ విధానంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఏపీడీపీఎంఎస్ సాఫ్ట్‌టెక్ డైరెక్టర్ సంధ్యా, ప్రసాద్, సంజయ్ బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొత్త విధానంలోని ముఖ్యాంశాలను విపులంగా వివరించారు. తాజా ఆన్లైన్ విధానం ద్వారా ఇళ్లు, అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను సులభంగా దరఖాస్తు చేసి, వేగంగా పొందవచ్చని తెలిపారు. అలాగే భూములను ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు అవసరమైన లేఅవుట్ అనుమతులను కూడా ఆన్లైన్ ద్వారానే పొందే విధంగా వ్యవస్థను రూపొందించినట్లు వివరించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఏపీడీపీఎంఎస్ 2.0 ద్వారా నిర్మాణ, లేఅవుట్ అనుమతుల జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారిందన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు నుంచి అనుమతి వరకు అన్ని సేవలను పొందవచ్చన్నారు. ఈ విధానం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు సేవల నాణ్యత కూడా మెరుగుపడుతుందన్నారు.

కార్యక్రమంలో అనంతపురం ప్రాంతీయ సంచాలకులు కెఎండీ ఇసాక్, ఇంచార్జి సిటీ ప్లానర్ వై.వి. వెంకటరమణ, కుడా పీఓలు బి. విజయ్ భాస్కర్, యూ. మోహన్ కుమార్, ఏపీడీపీఎంఎస్ సాఫ్ట్‌టెక్ డైరెక్టర్ సంధ్యా, క్రెడాయ్ చైర్మన్ గోరంట్ల రమణ, క్రెడాయ్ అధ్యక్షుడు జె. సురేష్ కుమార్, లెస్సా చైర్మన్ మురళీ మోహన్ రావు, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply