ఈనెల 9న నంద్యాల జిల్లాకు ముఖ్యమంత్రి రాక

  • సీఎం పర్యటన ఏర్పాట్లు సమన్వయంతో పనిచేయాలి
  • అన్ని శాఖలు పూర్తి సన్నద్ధతతో సిద్ధంగా ఉండాలి
  • జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

నంద్యాల ప్రతినిధి , ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 9 వ తేదీన నంద్యాల జిల్లా బనగానపల్లెకు వస్తున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, పూర్తి సన్నద్ధతతో పనిచేసి ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సీఎం పర్యటనకు సంబంధించిన నోట్స్‌లో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అధికారులు అత్యంత క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. వివరాల నమోదు, స్పెల్లింగ్, డ్రాఫ్టింగ్ లేదా ఇతరత్రా లోపాలు ఏవైనా ఉంటే వెంటనే సరిదిద్ది, సవరించిన సమాచారాన్ని తక్షణమే సమర్పించాలని సూచించారు.

స్టాళ్ల ఏర్పాటు, ఫ్లెక్సీల రూపకల్పన, ప్రదర్శించనున్న అంశాలు, ముఖ్యమంత్రికి సమర్పించనున్న బ్రీఫింగ్ నోట్స్‌ను కూడా వెంటనే సిద్ధం చేసి అందించాలని ఆదేశించారు. ప్రతి శాఖకు సంబంధించిన గణాంకాలు పూర్తిగా ఖచ్చితంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా భూగర్భ జలమట్టాలు, గృహనిర్మాణం, తాగునీటి సరఫరా, సామాజిక భద్రత పెన్షన్లు, స్వయం సహాయక సంఘాలు, బంగారు కుటుంబం, తల్లికి వందనం తదితర సంక్షేమ పథకాల వివరాలను పలుమార్లు పరిశీలించి సరైన సమాచారాన్నే సమర్పించాలని సూచించారు.

హౌసింగ్, మరుగుదొడ్లు, విద్యుత్ కనెక్షన్లు, రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్ల వంటి వ్యక్తిగత లబ్ధిదారుల వివరాలను అత్యంత జాగ్రత్తగా ధృవీకరించాలని ఆదేశించారు.
..యాక్షనబుల్ పాయింట్స్‌లో ప్రతి అంశానికి కొలిచే విధంగా స్పష్టమైన గణాంకాలు ఉండాలని తెలిపారు. మిల్లెట్స్ సాగు విస్తీర్ణం, మిర్చి ఉత్పత్తి, పండ్ల తోటలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్‌లు, పరిశ్రమల సంఖ్య, 500 ఎంఎస్‌ఎంఈల ద్వారా కల్పించిన ఉపాధి తదితర వివరాలను స్పష్టమైన సంఖ్యలతో సమర్పించాలని సూచించారు.

అలాగే సబ్‌సెక్టార్ వారీగా జివిఎ (GVA), జిల్లా 15 శాతం వృద్ధిరేటుకు సంబంధించిన వివరాలను గ్రాఫ్‌ల రూపంలో కాకుండా స్పష్టమైన గణాంకాలతో పొందుపరచాలని ఆదేశించారు. టూరిజం, జలహారతి, ప్రకృతి వ్యవసాయం, స్మార్ట్ వాటర్ మానిటరింగ్, సహకార రంగ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలను స్పష్టంగా పేర్కొనాలన్నారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా, సమయపాలనతో, తమ శాఖ అంశాలపై సంపూర్ణ అవగాహనతో పనిచేసి సీఎం పర్యటన విజయవంతానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.