లబ్ధిదారులకు రూ.17.35 కోట్ల పెన్షన్ల పంపిణీ
గన్నవరం – ఆంధ్రప్రభ : గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిని అజెండాగా పెట్టుకుని ముందుకు సాగుతున్నానని, అలానే ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నానని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. సోమవారం ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అధికారులు స్థానిక నాయకులతో కలసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలోని అవ్వాతాతలు, దివ్యాంగుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్ నగదును అందజేసి వారి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 40,521 మంది లబ్ధిదారులకు రూ.17.35 కోట్ల పెన్షన్ మొత్తాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిక్కవరం గ్రామంలో అక్రమంగా తవ్విన చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. చెరువును అక్రమంగా తవ్వి చిన్నారుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కామన్ సైట్స్‌పై అక్రమాణలపై ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటివరకు పని ప్రారంభించలేదని ఘాటుగా స్పందించారు. ఈ అంశాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని చెప్పారు. రామవరప్పాడులో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ.29 లక్షలతో నిర్మించిన రహదారిని త్వరలో ప్రారంభిస్తామని, దీని ద్వారా సుమారు 23 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అలాగే గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి సబ్‌స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. బాపులపాడు మండలంలో 60 ఎకరాలు, గన్నవరం మండలంలో 39 ఎకరాల ప్రభుత్వ భూములను అధికారులు అన్యాక్రాంతం నుంచి రికవరీ చేసినట్లు తెలిపారు.
బుడమేరు ప్రక్షాళనలో భాగంగా స్ట్రెయిటెనింగ్ చేపట్టడం ద్వారా విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న 150 ఎకరాల భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గన్నవరంలో రూ.200 కోట్ల పెట్టుబడితో సి-డాక్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, దీనివల్ల ఐటీ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌తో చర్చించనున్నట్లు చెప్పారు.
త్వరలో గన్నవరంలో పి-4 కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీనికి అవసరమైన కంప్యూటర్లు, ఫర్నిచర్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. హెచ్‌సీఎల్ సంస్థ తన సిఎస్ఆర్ నిధుల నుంచి ప్రతి నెలా రూ.6 లక్షలు కేటాయిస్తున్నందుకు సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉంగుటూరు గ్రామంలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంకును జల్ జీవన్ మిషన్ పథకం కింద పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉంగుటూరు మండలంలోని రోడ్డు పనులను కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు.
అవసరమైతే సిఎస్ఆర్ నిధులను వినియోగించి అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఈ.సత్యకుమార్, మండల టిడిపి అధ్యక్షులు కొలుసు రవీంద్ర, ఉంగుటూరు గ్రామ టిడిపి అధ్యక్షులు మారడా పాపారావు, రాష్ట్ర టిడిపి కార్యదర్శి మూల్పురి సాయి కళ్యాణి, ఏ.యం.సి వైస్ చైర్మన్ కొండేటి వెంకటేశ్వరరావు, అరుమళ్ళ కృష్ణారెడ్డి, గొడ్డళ్ల చిన్న రామారావు, గోళ్ళ రంగారావు, ఈడ్పుగంటి కృష్ణమూర్తి, అరికట్ల రవి, రాజబోయిన శివాజీ, అమర్తల సోమేశ్వరరావు, వంగా అయ్యప్పరెడ్డి, మేడేపల్లి రమ, తుమ్మల లత, యర్రగుంట్ల వినోద్, మునిపల్లి నాగరాజు, చింత చంద్రశేఖర్, మల్లాల రంగారావు, ఉయ్యూరు మురళి, తేలు సత్యనారాయణ, పోతినేని రామకృష్ణ, శ్రీను, కొండా రాంబాబు, నక్కా వెంకటేశ్వరరావు, నాగేంద్ర, చల్లగాలి సునీల్, పొట్లూరి భువనేశ్వరి, గరిమెళ్ళ వరప్రసాద్, పోతినేని బాపయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
