మండే ఎండలతో పశువుల గోస…
మండే ఎండలతో పశువుల గోస…
అటకెక్కిన సబ్సిడీ పశుగ్రాస పథకం
మేత, నీటి కొరతతో మూగజీవాల అవస్థలు..
ప్రభుత్వ జోక్యం కోరుతున్న పశు యజమానులు
ఇల్లెందు, ఆంద్రప్రభ : ఎండాకాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో మానవాళితో పాటు ప్రకృతిలోని సమస్త జీవరాశులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సహజంగా లభించే ఆహారం అందుబాటులో లేకపోవడం, నీటి నిల్వలు తగ్గిపోవడం వంటి కారణాలు జీవరాశుల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మాట్లాడగలిగే మనిషి తనను తాను రక్షించుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, నోరు లేని మూగజీవాల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది.
ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపదకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండేది. పశువుల కోసం వరి గడ్డి, జొన్న చొప్పు, కంది పొట్టు వంటి మేతను ముందుగానే నిల్వ చేసుకునేవారు. నీటి కోసం ప్రత్యేక తొట్లు ఏర్పాటు చేసి పశువులను కుటుంబ సభ్యుల్లా చూసుకునేవారు. అయితే కాలక్రమేణా వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడం, పశువుల వినియోగం తగ్గిపోవడంతో పశుసంపద సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది.
నేడు పంటలను నేరుగా విక్రయించడం, పశువుల మేత కోసం ప్రత్యేకంగా నిల్వలు చేయకపోవడం వల్ల ఎండాకాలంలో పశువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చెరువులు ఎండిపోవడం, పచ్చిక బయళ్లు కనుమరుగవడం వల్ల పశువులు, గేదెలు మేత, నీటి కోసం అల్లాడుతున్నాయి.
వేసవిలో పశు సంరక్షణ అత్యంత కీలకం

వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు పశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఆవులతో పోలిస్తే గేదెలు ఎక్కువగా ఉష్ణతాపానికి గురవుతాయి. గేదెల శరీరం నలుపు రంగులో ఉండటం, కొవ్వు శాతం అధికంగా ఉండటం, చెమట గ్రంథులు తక్కువగా ఉండటం వల్ల అవి వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి.
ఎండాకాలంలో గేదెలు మేతను తక్కువగా తీసుకుని నీటిని ఎక్కువగా తాగుతాయి. అందువల్ల వాటి శరీరాన్ని తరచూ నీటితో చల్లబరచడం అవసరం. గాలి ప్రసరణ లేని ప్రదేశాల్లో పశువులను కిక్కిరిసిన పరిస్థితుల్లో ఉంచడం, తగినంత నీటి సౌకర్యం లేకపోవడం వల్ల వడదెబ్బ ముప్పు మరింత పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని పశువైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అటకెక్కిన సబ్సిడీ పశుగ్రాస పథకం

పశు యజమానులు మాత్రమే కాకుండా ప్రభుత్వాలు కూడా మూగజీవాల సంక్షేమంపై తగిన శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో వేసవికాలంలో పశువుల పోషణ కోసం ప్రభుత్వం సబ్సిడీపై పశుగ్రాసాన్ని అందించే పథకాన్ని అమలు చేసేది. పశువైద్యశాలల ద్వారా రైతులకు సగం ధరకే పశుగ్రాసం పంపిణీ చేసే విధానం ఉండేది.
అయితే ఇటీవల కాలంలో ఈ పథకం అమలు నిలిచిపోవడంతో పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన మేత ధరలు, నీటి కొరత కారణంగా పశువుల పోషణ భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మేత, నీటి కొరతతో అల్లాడుతున్న మూగజీవాల పరిస్థితిని ప్రభుత్వం గుర్తించి, సబ్సిడీపై పశుగ్రాసం అందించే పథకాన్ని పునరుద్ధరించాలని పశు యజమానులు కోరుతున్నారు. పశుసంపదను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
