ఆక్రమణలపై మంత్రి పొంగులేటి సీరియస్
ఆక్రమణలపై మంత్రి పొంగులేటి సీరియస్
సత్తుపల్లి, జూన్ 9, ఆంధ్రప్రభ: ప్రభుత్వ భూమి ఎవరి కబ్జాలో ఉన్నా అంగుళం కూడా విడిచిపెట్టకుండా స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. “అక్రమణలో వేశ్యకాంతల చెరువు ముంపు భూములు” శీర్షికన ఆంధ్రప్రభలో వెలువడిన కథనానికి మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ స్పందించారు.
మంగళవారం ఎమ్మెల్యేతో కలిసి వేశ్యకాంతల చెరువు ముంపు ప్రాంతాన్ని మంత్రి పొంగులేటి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమి అంటే అది పేదల భూమి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించి, ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని ఆదేశించారు.
దాదాపు 315 ఎకరాల్లో విస్తరించి ఉండాల్సిన చెరువు భూమితో పాటు ముంపు, శిఖం, ఎఫ్టీఎల్ తదితర సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూములు బడా బాబుల ఆక్రమణలోకి వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలతో ఆంధ్రప్రభలో కథనం వెలువడటంతో మంత్రి స్వయంగా వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు సుమారు 14 ఎకరాలు ఆక్రమించుకుని అనుభవిస్తున్నట్లు, కొంతమంది రాజకీయ నేతలు తలా రెండు, మూడు ఎకరాలు ఆక్రమించుకున్నట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో కొంత భూమికి దొడ్డిదారిలో పాస్‌బుక్కులు సంపాదించి, సాగుతో పాటు రైతుబంధు తదితర ప్రభుత్వ సబ్సిడీ పథకాలు కూడా పొందుతున్నట్లు సమాచారం.
ఈ మొత్తం ప్రభుత్వ భూమిని చెర నుంచి విడిపించి, పేదల ఇళ్ల స్థలాల కోసం సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆక్రమణలు తొలగించిన వెంటనే చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఖర్చులకు నిధులు అవసరమైతే కలెక్టర్‌తో మాట్లాడతానని, సిబ్బంది అవసరమైతే పక్క మండలాల నుంచి తీసుకోవాలని అధికారులకు సూచించారు.
వారం రోజుల్లో కబ్జా నుంచి ప్రభుత్వ భూమి బయటకు రావాలని మంత్రి పొంగులేటి హుకుం జారీ చేశారు. అయితే సర్వే సమయంలో రైతుల ప్రైవేట్ పట్టా భూములకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేకంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, మున్సిపల్ చైర్మన్ ఎండి రెహానా బేగం, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.
