ఎమ్మెల్యే సైకిల్ ర్యాలీతో మసీదుకు చేరిక
ఎమ్మెల్యే సైకిల్ ర్యాలీతో మసీదుకు చేరిక
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి గురువారం ఎమ్మెల్యే గొండు శంకర్ సైకిల్‌పై బయలుదేరి జామియా మసీదుకు చేరుకుని బక్రీద్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మార్గమధ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ సామరస్య సందేశాన్ని చాటిచెప్పారు. మసీదు వద్దకు చేరుకున్న అనంతరం ముస్లిం పెద్దలు, మత నాయకులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు.
ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఎమ్మెల్యే గొండు శంకర్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ త్యాగానికి, మానవత్వానికి, సోదరభావానికి ప్రతీక అని అన్నారు. మత భేదాలు లేకుండా అందరూ కలిసి జీవించినప్పుడే సమాజంలో శాంతి, ఐక్యత నెలకొంటాయని పేర్కొన్నారు.
అదేవిధంగా బక్రీద్ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. పండుగ వేళ పేదలకు సహాయం చేయడం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
యువత సమాజ సేవలో ముందుండాలని, ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించే కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. దేశ అభివృద్ధికి మత సామరస్యం ఎంతో అవసరమని, పండుగలు ప్రజలను ఒక్కటిగా కలిపే వేదికలుగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువ కార్యకర్తలు, స్థానిక ముస్లిం పెద్దలు, మసీదు కమిటీ సభ్యులు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
