గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు: మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళిలో 23 యూనిట్ల మోపెడ్ వాహనాలు పంపిణీ
కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ: ప్రభుత్వం గిరిజనుల ఆర్థిక అభివృద్ధి సాధించేలా అన్ని విధాలా తోడ్పాటును అందిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం కోటబొమ్మాలిలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గానికి చెందిన గిరిజన మత్స్యకారులకు ఐస్ బాక్సులతో కూడిన 23 రెండు చక్రాల మోపెడు వాహనాలను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, సామాజిక ఆర్థిక అంతరాలను పూడ్చడానికి ప్రత్యేక కేంద్ర సహాయ ఉప పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 16 సబ్ ప్లాన్ మండలాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 69 యూనిట్ల మోపెడ్ వాహనాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో యూనిట్ విలువ రూ. 1,14,100 కాగా, ఇందులో 75 శాతం (రూ. 85,575) ప్రభుత్వ రాయితీ ఉంటుందని, మిగిలిన 25 శాతం (రూ. 28,525) లబ్ధిదారుల వాటాగా ఉంటుందని వివరించారు. టెక్కలి నియోజకవర్గంలో మంజూరైన 23 యూనిట్లలో నందిగామ మండలానికి 13, సంతబొమ్మాలికి 3, టెక్కలికి 7 చొప్పున పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
గిరిజన మత్స్యకారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టి సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం. కృష్ణమూర్తి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు కింజరాపు హరిప్రసాద్, మత్స్యశాఖ ఉపసంచాలకులు టి. సుమలత, సహాయ సంచాలకులు డి. గోపికృష్ణ, టెక్కలి మత్స్యకార అభివృద్ధి అధికారి ధర్మరాజ్ పాత్రో తదితరులు పాల్గొన్నారు.
