పవిత్ర ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం చుట్టూ ఆక్రమణల తొలగింపు అవసరం

పవిత్ర ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం చుట్టూ ఆక్రమణల తొలగింపు అవసరం


శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : నవ నారసింహ క్షేత్రాలలో ప్రసిద్ధి చెందిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం చుట్టూ ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించి ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ కదిరి నియోజకవర్గ ఇంచార్జీ భైరవ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆలయ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా భైరవ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ పవిత్ర ఆలయానికి రాష్ట్ర నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తారని తెలిపారు. అలాంటి ఆలయ పరిసరాల్లో నిర్లక్ష్యం కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కొద్దిపాటి వర్షం కురిసినా వర్షపు నీరు, మురుగు నీరు ప్రధాన రాజగోపురం గుండా ఆలయంలోకి ప్రవేశిస్తోందని పేర్కొన్నారు. దీనివల్ల ఆలయ పవిత్రత దెబ్బతినడమే కాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు.

ఆలయం చుట్టూ ఉన్న తిరువీధుల్లో కాలువలు పూడికతో నిండిపోయాయని, వాటిని శుభ్రం చేయకపోవడం వల్ల నీటి ప్రవాహం సక్రమంగా జరగడం లేదన్నారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ బలహీనంగా ఉండటం, కాలువలపై ఆక్రమణలు పెరగడం వల్ల ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య ఎదురవుతోందని తెలిపారు.

ఆలయ భూములు, కాలువలపై కొందరు ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. వెంటనే రెవెన్యూ, మున్సిపల్, ఆలయ శాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకుని ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు.

ఆలయ భూములను స్వాధీనం చేసుకుని దేవస్థాన పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తులు ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. అవసరమైతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చలపతి, లక్ష్మణ్, చిన్నపరెడ్డి, రవికుమార్, అంజిబాబు, పొరకాల రాజేంద్రప్రసాద్, ఇర్ఫాన్, రామ్మోహన్, రంగిశెట్టి రాజేంద్రప్రసాద్, రామచంద్ర, హరిబాబు, గంగరాజు, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.



Leave a Reply