“రైతులపై ప్రైవేట్ దోపిడీకి గండి పడుతుందా?
“రైతులపై ప్రైవేట్ దోపిడీకి గండి పడుతుందా?
వెబ్ కమ్యూనిటీతో కొత్త విప్లవం”
దమ్మపేట, ఆంధ్రప్రభ : ఆయిల్ పామ్ రైతులను ఆర్థికంగా బలోపేతం చేసి, ప్రైవేట్ సంస్థల దోపిడీ నుంచి రక్షించేందుకు ‘వెబ్ కమ్యూనిటీ’ ఏర్పాటు చేయనున్నట్లు ప్రముఖ రైతు మద్దినేని వెంకట్ తెలిపారు.
దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ కర్మాగారంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు, నిపుణులు, అధికారులను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం ద్వారా సాగులో ఎదురయ్యే సవాళ్లను సులభంగా పరిష్కరించుకోవచ్చని చెప్పారు.
ప్రైవేట్ కంపెనీలు ధరల విషయంలో రైతులను మభ్యపెడుతున్నాయని ఆయన ఆరోపించారు. అందరూ ఒకే వేదికపైకి వస్తే పారదర్శకత పెరుగుతుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఆయిల్‌ఫెడ్ ద్వారా సేవలు వేగవంతం అయ్యాయని తెలిపారు. ఫ్యాక్టరీల్లో నిమిషాల వ్యవధిలోనే అన్లోడింగ్ పూర్తవుతోందని, నాలుగు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
భూసార రక్షణ కోసం ప్రభుత్వ సహకారంతో రూ.50 లక్షల సబ్సిడీతో 8 చోట్ల కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటు, అలాగే 50 శాతం సబ్సిడీపై బయో-ఫెర్టిలైజర్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో అశ్వారావుపేట, అప్పారావుపేట, సిద్దిపేట ఫ్యాక్టరీలు నిరంతరాయంగా పనిచేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు.
పామాయిల్ సాగు రైతులకు స్థిర ఆదాయ వనరుగా మారిందని మద్దినేని వెంకట్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పుల్లారావు, బచ్చు సత్యనారాయణ, మొగళ్ళపు చెన్నకేశవరావు, కొయ్యల అచ్యుతరావు, బండి భాస్కర్, పర్వతనేని వరప్రసాదరావు, దొడ్డా భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
