Vyra | అందరికీ ఉపాథి, ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌డ‌మే ప్ర‌భుత్వం ల‌క్ష్యం – డిప్యూటీ సిఎం భ‌ట్టి

వైరా – తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 80 ప్రైవేట్ కంపెనీల సహకారంతో 5 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో వైరా ఎమ్మెల్యే మాలోత్
రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఆయ‌న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం చీకటిమయం అవుతుందని ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు.గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కూడా నిర్మించలేదని స్పష్టం చేశారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో థర్మల్ విద్యుత్,విండ్ పవర్, సోలార్ పవర్, పంపు స్టోరేజ్ పవర్,హైడల్ పవర్ ప్రాజెక్టులపై దృష్టి సారించామని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో హైడల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి అక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్తును మన రాష్ట్రానికి తెచ్చుకునేందుకు ఎంవోయూలు కుదుర్చుకున్నామని వివరించారు. అంతేకాకుండా రాజస్థాన్ రాష్ట్రంలోని ఎడారుల్లో సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఓయూలు చేసుకుందని అన్నారు. విద్యుత్ విషయంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని తెలంగాణ రాష్ట్రంలో సర్ ప్లస్ పవర్ ను అందిస్తున్నామని చెప్పారు.

గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రానికి ఏమీ చేయకుండా ప్రభుత్వ ఆదాయాన్ని బీఆర్ఎస్ నాయకులు లూటీ చేశారని విమర్శించారు.ఫామ్ హౌస్ లో పడుకున్న నాయకులు ఈరోజు బయటకు వచ్చి ప్రజలకు అన్యాయం జరుగుతుందని ముసలి కన్నీరు కారుస్తున్నారని కేసీఆర్ ను పరోక్షంగా విమర్శించారు.బీఆర్ఎస్ నాయకులు ఆదాయాన్ని దోపిడీ చేస్తే న్యాయమా రాష్ట్ర సంపదను కాంగ్రెస్ ప్రజలకు పంచితే అన్యాయమా అంటూ ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రతి రూపాయిని పోగేసి ప్రజలకు పంచుతామని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యం లో ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగ అవకాశాలు స్వయంఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ జాబ్ మేళాలో వచ్చిన ప్రతి అవకాశాన్ని నిరుద్యోగులు అందిపుచ్చుకోవాలని సూచించారు. నేడు వచ్చిన చిన్న అవకాశం నుంచి ప్రతి మెట్టు ఎదిగి పెద్ద అవకాశాలకు మార్గం సుగుమం చేసుకోవాలన్నారు. నిరుద్యోగులు ప్రతి అవకాశాన్ని బాధ్యతగా భావించి ముందుకు సాగాలన్నారు. ప్రతిరోజు, ప్రతి నిమిషం విలువైనదిగా నిరుద్యోగులు గుర్తించాలన్నారు.

వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ విజ్ఞప్తితో సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వివరించారు.దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా సుమారు 90 లక్షల కుటుంబాల పేదలకు సన్నబియ్యం ను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం మెగా జాబ్ మేళాలో ఉద్యోగం సాధించిన నిరుద్యోగులకు వైరా ఎమ్మెల్యే తో కలిసి భట్టి అపాయింట్మెంట్ లెటర్ లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, , సింగరేణి సిఎండి బలరాం నాయక్ , రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు బొర్రా రాజశేఖర్, శీలం వెంకట నర్సిరెడ్డి ,నూతి సత్యనారాయణ, ఏదునూరి సీతారాములు , సూతకాని జైపాల్ , కట్ల రంగారావు, కట్ల సంతోష్, పమ్మి అశోక్, మల్లు రామకృష్ణ, మేడ ధర్మారావు , స్వర్ణ నరేందర్, వడ్డే నారాయణ, సూరంపల్లి రామారావు, కోసూరు శీను , దొబ్బల సౌజన్య , నంబూరి కనకదుర్గ,ధర్నా రాశేఖర్, కొప్పురావూరి శబరి నాథ్ , మండల నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *