ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
అశ్వాపురం (ఆంధ్రప్రభ): సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులపై ప్రచారం, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లకే పరిమితమైందని, ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచి అనేక పనులను అసంపూర్తిగా వదిలేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీరు అందిస్తుందని తెలిపారు.
మంత్రి మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టుపై రూ.8 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినప్పటికీ బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదన్నారు. నిజాంసాగర్ వంటి పాత ప్రాజెక్టులు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే దెబ్బతిన్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో వరి కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఫౌండేషన్ నాసిరకంగా ఉందని, అందులో నీటిని నిల్వ చేయవద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిందని మంత్రి తెలిపారు. ఫౌండేషన్‌కు రీ-టెస్టింగ్, మరమ్మతులు చేపట్టాలని సూచించడంతో ప్రస్తుతం నీటిని వదలడం లేదన్నారు. అన్నారం, సుండిల్ల బ్యారేజీల్లో కూడా లీకేజీలు ఉన్నాయని పేర్కొంటూ, టెస్టింగ్, పునరుద్ధరణ పనులు పూర్తి చేసి మూడు బ్యారేజీలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందుకోసం వెయ్యికి పైగా ఇంజినీర్లు, సిబ్బందితో సమగ్ర మరమ్మతులు చేపడుతున్నామని వెల్లడించారు.
