TG | అన్నదాతపై తరుగు పేరిట బహిరంగ దోపిడీ !

TG | అన్నదాతపై తరుగు పేరిట బహిరంగ దోపిడీ !

TG | రైతుల కష్టమంతా మిల్లర్ల పాలు
తరుగు ధాన్యం ఎవరి జేబుల్లోకి వెళ్తోందనీ ప్రశ్నిస్తున్న రైతులు
క్వింటాలుకు దాదాపు 8 కిలోల వరకు కటింగ్‌

TG | కమ్మర్ పల్లి, ( ఆంధ్ర ప్రభ ):– ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మరియు రైస్ మిల్లుల్లో “తరుగు” పేరుతో రైతులను మోసం చేయడం ఒక ప్రధాన సమస్యగా మారింది.పీఏఎస్ లలో అధికారులు నిర్ణయించిన నిబంధనల కంటే అదనంగా కిలోల కొద్దీ ధాన్యాన్ని తరుగు పేరిట కోత విధిస్తూ మిల్లర్లు మరియు దళారులు రైతులను నష్టపరుస్తున్నారు.ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్న తరుగు పేరిట నిండా మునగాల్సి వస్తుంది.రెక్కల కష్టం మిల్లర్ల పాలవుతున్నా..అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తుంది.ఒక్కో రైతు వేలాది రూపాయలు నష్టపోతున్నా.. పట్టించుకునేవారేలేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ధాన్యం కొనుగోళ్లలో పెద్ద మొత్తంలో దోపిడీ జరుగుతున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.రైతుల నుంచి అదనంగా తరుగు పేరిట తూకం వేస్తున్న విషయం అధికారులు,మిల్లర్ల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాతనే ఇలా జరుగుతోందనే ఆరోపణలు సైతం లేక పోలేదు.రైతులకు ఎలాంటి నష్టమూ వాటిల్లకుండా,
ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.రైతులు పంటను అమ్ముకోవడానికి ధాన్యం తీసుకురాగా.. తరుగు పేరిట దోచుకుంటున్నారు.క్వింటాలు ధాన్యానికి సుమారు 8 కిలోలపై వరకు తరగు పేరిట అదనంగా ధాన్యం దోచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.వరి పంటకు మద్దతు ధర క్వింటాలుకు గ్రేడ్ ఏ రకానికి రూ.2,389 కాగా,కామన్ రకానికి రూ.2,369 ప్రభుత్వ మద్దతు ధర ఉంది.కొనుగోలు కేంద్రాల్లో ఒక్క వడ్ల సంచికి 41 కిలోల 700 గ్రాములుగా తూకం వేస్తున్నారు.ఇందులో రైతులకు కేవలం 38 కిలోలు మాత్రమే రాగా.. మిగతా 3 కిలోల 700 గ్రాములు తరుగు పేరిట దోపిడి చేస్తున్నారు. ఇందులో గన్ని సంచికి 1 కిలో,తరుగు పేరుతో 2 కిలోల 700 గ్రాముల చొప్పున తరుగు తీస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.తరుగు ఇవ్వకపోతే ధాన్యం దిగుమతికి మిల్లర్లు నిరాకరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

రైస్ మిల్లర్ల తీరుతో తరుగు తప్పట్లేదు..

పార్శపు జైపాల్ రెడ్డి, కమ్మర్ పల్లి రైతు

దుక్కి దున్నింది మొదలు పంట పండించే దాకా గొడ్డు కష్టం చేస్తున్న రైతుకు చివరికి ఆ పంటను అమ్ముకుందామన్నా అరిగోస… తప్పడం లేదు. “తరుగు” పేరిట పీఏసిఎస్ సెంటర్ల నిర్వాహకులు అన్నదాతలను నిలువుదోపిడీ చేస్తున్నారు.5 మంది రైతులమంతా కలిసి ఒక లారీ ధాన్యపు సంచుల లోడింగ్ లో మొత్తం 774 ధాన్యపు సంచులకు లోడింగ్ చేయగా 31 టన్నుల 734 కిలోలు కాగా..41 ధాన్యపు సంచులు తరుగు పేరిట మా అందరి వద్ద తీసివేయగా,733 ధాన్యపు సంచులు ట్రక్ షిట్ లో 29 టన్నుల 320 కిలోలు మాత్రమే మాకు రాసి ఇచ్చారు.మిగిలినా 24 క్వింటాళ్ల 14 కిలోలు మిల్లర్లు దోపిడికి పాల్పడ్డారనీ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే సుమారు రూ.57,వేల 670 తరుగు ధాన్యం డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని రైతులు ప్రశ్నిస్తున్నారు.

అదనపు తరుగు కోతతో రైతులకు నష్టం

రేంజర్ల మహేందర్, కమ్మర్ పల్లి సొసైటీ డైరెక్టర్

నిబంధనల ప్రకారం కోతవిధించాల్సిన దానికంటే ఎక్కువగా,క్వింటాలుకు 8 కిలోల వరకు తరుగు పేరుతో రైతుల నుండి అదనపు ధాన్యాన్ని దోచుకుంటున్నారని,
ఎంతో కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోగా,ఇలా తరుగు పేరిట ధాన్యం తగ్గించడం వల్ల ఒక్కో రైతు వేల రూపాయలు నష్టపోతున్నామని వాపోయారు.సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం ఆరబోయడానికి కల్లాలు లేక ఇతరుల ఖళీ ప్రదేశంలో అరువు తీసుకొని ధాన్యాలు ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు.కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్ల ఈ దోపిడీ నిరంతరాయంగా సాగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని,తరుగు దోపిడీని అరికట్టి తమకు న్యాయం చేయాలని కోరారు.