65cabins | కశ్మీర్ గుల్మార్గ్ లో కేబుల్ కార్ వ్య‌వ‌స్థ‌లో సాంకేతిక లోపం

65cabins | కశ్మీర్ గుల్మార్గ్ లో కేబుల్ కార్ వ్య‌వ‌స్థ‌లో సాంకేతిక లోపం

65cabins | గాల్లో చిక్కుకున్న 300 మందికి పైగా పర్యాటకులు
ఏడు గంటల పాటు శ్రమించి అందరినీ కాపాడిన ప్ర‌త్యేక బృందాలు
ఘటనపై విచారణకు ఆదేశించిన జమ్మూకశ్మీర్ ప్రభుత్వం

65cabins | క‌శ్మీర్, ఆంధ్ర్రప్ర‌భ : జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం గుల్మార్గ్‌లో సోమవారం చోటుచేసుకున్న పెను ప్రమాదం నుంచి 300 మందికి పైగా పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు. గొండోలా కేబుల్ కార్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో, 65 క్యాబిన్లలో చిన్నారులు, మహిళలతో సహా పర్యాటకులు గంటల తరబడి గాల్లోనే చిక్కుకుపోయారు. సుమారు ఏడు గంటల పాటు సాగిన భారీ రెస్క్యూ ఆపరేషన్ అనంతరం అందరినీ క్షేమంగా కిందకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివ‌రాల‌లోకి వెళితే.. గుల్మార్గ్‌లోని గొండోలా కేబుల్ కార్ వ్య‌వ‌స్థ‌లో మొదటి దశలో ఈ సాంకేతిక సమస్య తలెత్తింది. సమాచారం అందుకున్న వెంటనే భారత సైన్యం, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు , స్థానిక పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. ప్రతికూల వాతావరణం, బలమైన గాలుల మధ్య, కొన్ని క్యాబిన్లు నేలకు 500 అడుగుల ఎత్తులో వేలాడుతున్నప్పటికీ సహాయక బృందాలు ధైర్యంగా చర్యలు చేపట్టాయి. ప్రత్యేక తాడులు, అత్యాధునిక పరికరాలతో క్యాబిన్ల వద్దకు చేరుకుని, పర్యాటకులను ఒక్కొక్కరిగా సురక్షితంగా కిందకు దించారు.

సహాయక బృందాలకు అమిత్ షా అభినంద‌న‌లు
ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. సాంకేతిక లోపంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. “ఈ ఘటనను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. లోపాలకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటాం” అని ఆయన వివరించారు. సహాయక చర్యలను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, డీజీపీ నలిన్ ప్రభాత్ దగ్గరుండి పర్యవేక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సహాయక బృందాల నైపుణ్యాన్ని, ధైర్యాన్ని ప్రశంసించారు. ముందుజాగ్రత్త చర్యగా, నేడు , రేపు సర్వీసును పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రోజుల్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తి నగదు వాపసు ఇవ్వనున్నట్లు తెలిపారు.

CLICK HERE TO READ Delhi | రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన సీఎం

CLICK HERE TO READ MORE