Delhi | రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన సీఎం

Delhi | రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన సీఎం
Delhi | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : వీడీ సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం అనంతరం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించే దిశగా ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
ప్రధాని కార్యాలయంలో సుమారు 20 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెండింగ్లో ఉన్న రైల్వే, జాతీయ రహదారి ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర ఆర్థిక సహాయం వంటి అంశాలపై సీఎం సతీశన్ ప్రధానికి వినతిపత్రం సమర్పించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. జయతిలక్ కూడా పాల్గొన్నారు.
దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఓడించి యూడీఎఫ్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఈ సమావేశం జరగడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అయితే భేటీ అనంతరం బయటకు వచ్చిన సీఎం సతీశన్ చర్చల పూర్తి వివరాలను వెల్లడించలేదు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లను కూడా కలవనున్నారు.

