అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం

అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం
తిరుపతి ఆంధ్రప్రభ ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 35 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలి మండలం సింగనపల్లి గ్రామం నుంచి కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే రామకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మూడో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 35 నియోజకవర్గాల్లో పార్కుల శంకుస్థాపనలు జరిగాయని పేర్కొన్నారు.
అవసరమైన మౌలిక సదుపాయాలు
డక్కిలి మండలం సంగనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్‌తో పాటు, చంద్రగిరి నియోజకవర్గంలోని మంగళం టౌన్ పరిధిలో అత్యాధునిక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. తిరుపతి నియోజకవర్గం మినహా జిల్లాలోని మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల శంకుస్థాపనలు పూర్తయ్యాయని చెప్పారు.
పార్కుల అభివృద్ధికి ఏపీఐఐసీ ఆధ్వర్యంలో సుమారు రూ.11 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ సదుపాయాలు, ట్రీట్మెంట్ ప్లాంట్లు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులు పూర్తైన తర్వాత స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్లాట్లు కేటాయిస్తామని తెలిపారు.
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
స్థానిక నిరుద్యోగ యువత, రైతులు గ్రూపులుగా ఏర్పడి చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ పార్కుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆదాయ వనరులు విస్తరించే అవకాశం ఉందన్నారు.
డక్కిలి మండలంలో నవోదయ విద్యాసంస్థ ఏర్పాటుకు భూమి సేకరించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అదే విధంగా జలధార జలహారతి కార్యక్రమం కింద చెరువుల అభివృద్ధికి సుమారు రూ.1.10 కోట్లతో పనులు చేపట్టినట్లు చెప్పారు.
వేగంగా అభివృద్ధి
ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుతో వెనుకబడిన మండలాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బాను ప్రకాష్ రెడ్డి, ఏపీఐఐసీ జోన్ మేనేజర్ విజయ భరత్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
