క్షణాల్లో బూడిదైన రెండు ఇళ్లు.. ఏమైంది అక్కడ..?
క్షణాల్లో బూడిదైన రెండు ఇళ్లు.. ఏమైంది అక్కడ..?
బాపట్ల, ఆంధ్రప్రభ : బాపట్ల పట్టణంలోని మున్నంవారిపాలెంలో జరిగిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. బైపాస్ సమీపంలోని రెండు పూరిళ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఈ ఘటనలో ఇళ్లలో ఉన్న సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. బీరువాలో భద్రపరిచిన భారీ మొత్తంలో నగదు కూడా కాలిపోయినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల ఎద్దులను అమ్మగా వచ్చిన డబ్బును ఇంట్లో పెట్టుకున్నామని, మంటల్లో అది కూడా బూడిదైందని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే రెండు పూరిళ్లు పూర్తిగా కాలిపోయినట్లు తెలిసింది.
ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లను స్థానికులు, కుటుంబ సభ్యులు సమయస్ఫూర్తితో బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే మరింత భారీ నష్టం జరిగేదని గ్రామస్థులు తెలిపారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
