ఏపీలో కరోనా అలర్ట్‌..

  • 12 పాజిటివ్ కేసులు, నలుగురు మృతి
  • కడప, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరులో కేసులు నమోదు
  • అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచన

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మొత్తం 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కడప, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో ఈ కేసులు గుర్తించినట్లు తెలిపారు.

ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ముగ్గురు బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

అలాగే, కోవిడ్ పాజిటివ్ ఉన్న నలుగురు వ్యక్తులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, పరీక్షా కిట్లు, ఆక్సిజన్ సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అనుమానాస్పద లక్షణాలు కనిపించే వారికి వెంటనే కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా అధికారులకు సూచనలు జారీ చేసింది.