పట్టణంలో దుర్వాసన కలకలం.. ప్రజల్లో ఆందోళన

మహబూబాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో గబ్బిలాల కళేబరాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. రైల్వే స్టేషన్ సమీపంలోని ఈద్గా బజార్, భవానీనగర్ తండా, పోలీస్ క్వార్టర్స్ ప్రాంతాల్లో దుర్వాసన తీవ్రంగా వ్యాపిస్తోంది. డిఎస్పీ కార్యాలయం, నీటిపారుదల శాఖ ప్రాంగణంలోని భారీ చింతచెట్టుపై వేలాది గబ్బిలాలు నివాసం ఉంటున్నాయి. తీవ్ర ఎండలతో గత నాలుగు రోజులుగా గబ్బిలాలు పెద్దఎత్తున మృతి చెందుతున్నాయి. కొన్ని గబ్బిలాలు నేలపై పడిపోగా మరికొన్ని చెట్లకు వేలాడుతూ కనిపిస్తున్నాయి. కళేబరాలు కుళ్లిపోవడంతో దుర్వాసన పరిసరాలను కమ్మేసింది. గబ్బిలాలపై వాలిన ఈగలు కాలనీల్లోకి వ్యాపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

వాంతులు, విరోచనాలు, తలనొప్పులతో పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గబ్బిలాల కళేబరాల నుండి వ్యాపించే సూక్ష్మక్రిములు ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మున్సిపల్ అధికారులకు స్థానికులు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం గబ్బిలాల కళేబరాలపై బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కోరినా స్పందన లేదని వాపోతున్నారు.

మున్సిపాలిటీలో బ్లీచింగ్ పౌడర్ లేదని అధికారులు చెప్పినట్లు సమాచారం. జూన్ వరకు బ్లీచింగ్ పౌడర్ రాదని చెప్పడంతో ప్రజలు విస్తుపోతున్నారు. మీరు కొనుక్కొని చల్లుకోండి అన్న సమాధానం మరింత ఆగ్రహానికి దారి తీసింది. పట్టణ నడిబొడ్డునే ఇలాంటి పరిస్థితి నెలకొనడం ప్రజలను కలవరపెడుతోంది. ప్రజల ఆరోగ్య భద్రతపై అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే గబ్బిలాల కళేబరాలను తొలగించి శానిటేషన్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply