ఆస్తులు రాయించుకుని.. బయటకు గెంటేసి…

ఆస్తులు రాయించుకుని.. బయటకు గెంటేసి…

మంగళగిరిలో దారుణం..
పోలీసుల చొరవతో తిరిగి ఇంటికి చేరిన బాధితుడు
మంగళగిరి మండలం నవులూరులో మానవత్వాన్ని చాటిన ఎస్సై వెంకట్

మంగళగిరి, ఆంధ్రప్రభ : మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో హృదయాన్ని కదిలించే ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తుల కోసం కుటుంబ సభ్యులే ఓ వృద్ధుడిని ఇంటి నుంచి బయటకు పంపించగా, పోలీసులు మానవత్వంతో స్పందించి తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. నవులూరు గ్రామ పరిధిలోని పశువుల ఆస్పత్రి సమీపంలో అవ్వారు నాగేశ్వరరావు అనే వృద్ధుడు నిరాశ్రయ స్థితిలో ఉండటం స్థానికులను కలిచివేసింది. ఒంటరిగా బాధాకర పరిస్థితుల్లో ఉన్న ఆయనను గమనించిన సచివాలయ పోలీసు సిబ్బంది, నవులూరు గ్రామ టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ నజీర్ వెంటనే మంగళగిరి గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ తక్షణమే ఘటన స్థలానికి చేరుకుని వృద్ధుడి పరిస్థితిని పరిశీలించారు. నాగేశ్వరరావుతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోగా, కుటుంబ సభ్యులు ఆయన పేరున్న ఆస్తులను తమ పేర్లకు రాయించుకుని అనంతరం ఇంటి నుంచి బయటకు పంపించినట్లు తెలిసింది. ఈ ఘటనపై స్పందించిన ఎస్సై వెంకట్ కుటుంబ సభ్యలను సంప్రదించి వారికి బాధ్యతను గుర్తు చేశారు. వృద్ధులను నిర్లక్ష్యం చేయకుండా సంరక్షించడం కుటుంబ సభ్యుల కర్తవ్యమని సూచించారు.

అనంతరం నాగేశ్వరరావును సురక్షితంగా తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకట్ మాట్లాడుతూ, ఆస్తుల కోసం వృద్ధులను వేధించడం సమాజానికి మంచిది కాదన్నారు. పెద్దలను గౌరవంగా చూసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కుటుంబ సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పోలీసుల మానవత్వంతో కూడిన స్పందనపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేశారు.