దివ్యాంగులకు భరోసా కల్పించాలి..

దివ్యాంగులకు భరోసా కల్పించాలి..

గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ

గుంటూరు/ఆంధ్రప్రభ : దివ్యాంగుల జీవనోపాధికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం శనివారం ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ అర్జీలు స్వీకరించి, దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఉపాధి అవకాశాలు కల్పించాలని దివ్యాంగులు కోరగా, ఒకసారి ఉపాధి పొందిన తర్వాత తిరిగి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాకుండా స్థిరమైన జీవనోపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని దివ్యాంగుల సంఖ్య, వారి విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవాలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని సూచించారు. అవసరమైన వారికి ఉపాధి కల్పన మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ ద్వారా ప్రత్యేక శిక్షణలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

దివ్యాంగులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ, వారికి తగిన అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగులను పేరు పేరునా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కలెక్టర్, ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రతి నెల నాలుగో శనివారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని, అందిన ప్రతి అర్జీని నాణ్యంగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.

దివ్యాంగుల స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా, పురుషులకు ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారు స్వయం సమర్థులుగా నిలబడేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రీవెన్స్ ప్రాంగణంలో కూలర్లు, తాగునీరు, మజ్జిగ వంటి సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ఎస్‌కే ఖాజా వలి, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కెవివి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి.దుర్గాభాయి, జిల్లా రిజిస్ట్రార్ శైలజ, ఉద్యాన శాఖ ఉపసంచాలకులు రవీంద్రబాబు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి. రంగారావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె. కళ్యాణ చక్రవర్తి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి. ప్రసూన, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వి. శంకర్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, ఆర్టీవో కె. శ్రీహరి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.