VC Sajjanar | 10కిపైగా భాషల్లో ఫిర్యాదుల నమోదు సదుపాయం

VC Sajjanar | 10కిపైగా భాషల్లో ఫిర్యాదుల నమోదు సదుపాయం

VC Sajjanar | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : దేశంలోనే తొలి ఏఐ ఆధారిత ఫిర్యాదు రికార్డర్‌ ‘ఏఐ కాప్‌రైటర్‌’ యాప్‌ను వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా పౌరులు 10కిపైగా భాషల్లో పోలీసులకు ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు.

ఫిర్యాదు దారులు చెప్పిన విషయాలను యాప్ వెంటనే టెక్ట్స్‌గా మార్చి అవసరమైన భాషలోకి అనువదించగలదని సజ్జనార్ వెల్లడించారు. ఫిర్యాదు వివరాలు ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ రూపంలో సేవ్ అయ్యే సదుపాయం కూడా ఉందన్నారు. ముఖ్యంగా వలస కార్మికులు, పర్యాటకులు, మహిళలు, వృద్ధులకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా మారుతుందని చెప్పారు.

భాష న్యాయానికి అడ్డంకి కాకూడదన్న లక్ష్యంతో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. తొలి దశలో హైదరాబాద్ పరిధిలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్ ప్రక్రియను వేగంగా, కచ్చితత్వంతో పూర్తి చేసేందుకు ఈ యాప్ దోహదపడుతుందని పేర్కొన్నారు. బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సహకారంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు.