ఇంధన పొదుపుకు వినూత్న సందేశం..

ఇంధన పొదుపుకు వినూత్న సందేశం..

సైకిల్‌పై రైల్వే స్టేషన్‌కు చేరుకున్న మంత్రి సవిత

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుకు స్పందిస్తూ రాష్ట్రమంత్రి ఎస్ సవిత పెనుకొండలో ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించబడింది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలనే సంకల్పంతో మంత్రి సవిత తన కుమారుడితో కలిసి సైకిల్‌పై ప్రయాణించి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. సోమవారం ఉదయం పెనుకొండ క్యాంపు కార్యాలయం నుంచి పెనుకొండ రైల్వే స్టేషన్ వరకు ఆమె తన కుమారుడితో కలిసి సైకిల్‌పై ప్రయాణించారు. అనంతరం అక్కడి నుంచి రైలులో విజయవాడకు బయలుదేరారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంధన వనరులు పరిమితమైనవని, భవిష్యత్ తరాలకు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అవసరం లేని సందర్భాల్లో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల వినియోగాన్ని తగ్గించి సైకిళ్లు, ప్రజా రవాణా వ్యవస్థలను ఎక్కువగా ఉపయోగించాలన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రతి పౌరుడు పర్యావరణ హిత చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. చిన్న చిన్న మార్పులు కూడా సమాజంపై పెద్ద ప్రభావాన్ని చూపగలవని తెలిపారు.

ముఖ్యంగా యువత ఇంధన పొదుపుపై అవగాహన పెంపొందించుకుని, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సైకిల్‌పై స్టేషన్‌కు చేరుకుని రైలులో ప్రయాణించడం ద్వారా ఇంధన పొదుపుతో పాటు ఆరోగ్య పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ వినూత్న చర్యను స్థానికులు అభినందిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పించే మంచి ప్రయత్నమని కొనియాడారు.