Vande Bharat | రెండు ఆవులను ఢీకొట్టిన రైలు.. హిందూపురం వద్ద కలకలం
Vande Bharat | రెండు ఆవులను ఢీకొట్టిన రైలు.. హిందూపురం వద్ద కలకలం
Vande Bharat | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఏపీలోని సత్యసాయి జిల్లాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. హిందూపురం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపైకి వచ్చిన రెండు ఆవులను రైలు ఢీకొట్టడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాచిగూడ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ హిందూపురం సమీపానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆవులను ఢీకొట్టడంతో పెద్ద శబ్దం రావడంతో లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న హిందూపురం రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పట్టాలపై పడిన ఆవుల కళేబరాలను తొలగించి, రైలుకు ఎలాంటి నష్టం జరగలేదని నిర్ధారించారు.
భద్రతా తనిఖీలు పూర్తైన అనంతరం అధికారులు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు అరగంట ఆలస్యంగా రైలు తిరిగి తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
