అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం..

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించు కొని శుక్రవారం ఉరవకొండలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించారు. కరిబసవ స్వామి గవి మఠం వద్ద నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉరవకొండ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రవిచంద్ర మాట్లాడుతూ.. గంజాయి, హెరాయిన్, కొకెయిన్ వంటి నిషేధిత మత్తుపదార్థాల వల్ల కలిగే తీవ్ర నష్టాలను వివరించారు. ఇవి గుండె, శ్వాసకోశ సమస్యల వంటి శారీరక రుగ్మతలతో పాటు డిప్రెషన్, సైకోసిస్ వంటి మానసిక సమస్యలకు కారణమవుతాయని తెలిపారు.

ఆర్థిక నష్టాలకు, కుటుంబాలు విడిపోవడానికి దారితీస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత చిన్న వయసులోనే వీటికి బానిసలైతే వారి విద్యా, వృత్తి అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయని హెచ్చరించారు. ఈ మహమ్మారి నివారణకు ప్రజల సహకారం అవసరం అన్నారు. సమాజంలో ఎక్కడైనా అనుమానాస్పద మత్తుపదార్థాల రవాణా లేదా విక్రయాలు గమనిస్తే ఎక్సైజ్ కార్యాలయానికి లేదా పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు. వ్యసన విముక్తి కోసం కుటుంబ సభ్యులకు అవసరమైన మార్గదర్శకత్వం చేయాలని, డ్రగ్స్ సరఫరాను అరికట్టడానికి తమ శాఖ ఆధ్వర్యంలో దాడులు, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీధర్ బాబు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.