ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బంది పిల్లలకు ఘన సన్మానం
ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బంది పిల్లలకు ఘన సన్మానం
- మెరిట్ సర్టిఫికెట్లు, నగదు బహుమతుల ప్రదానం
- విద్యార్థులను అభినందించిన రాష్ట్ర మంత్రులు, అధికారులు
- ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచన
తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): ఇటీవల నిర్వహించిన పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తమ ఫలితాలు సాధించిన పోలీస్ సిబ్బంది పిల్లలను, రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, స్థానిక శాసన సభ్యులు బొజ్జల సుదీర్ రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడులు ఘనంగా సన్మానించారు. 10 వ తరగతి, ఇంటర్మీడియేట పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు, నగదు బహుమతులను అందజేసి వారి కృషిని అభినందించారు. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో తీరికలేని పరిస్థితి ఉన్నప్పటికీ, తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతూ వారికి మంచి విద్య అందిస్తున్నారని కొనియాడారు.

ఈ సందర్భంగా మంత్రులు అనిత, అనగాని మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో ఉత్తమ విద్యా బోధన విధానాలు ప్రవేశ పెట్టారని, తద్వారా ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు సాధించిన విజయాలు వారి తల్లిదండ్రులకు గర్వకారణమని పేర్కొన్నారు.
క్రమశిక్షణ, పట్టుదలతో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. పోలీస్ కుటుంబాలకు చెందిన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షిస్తూ వారికి అవసరమైన ప్రోత్సాహం ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
