చేపల మృతి కలకలం

చేపల మృతి కలకలం

-విష ప్రయోగమా..? కలుషిత నీటి ప్రభావమా..?
-పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని గ్రామస్థుల డిమాండ్

అచ్చంపేట, ఆంధ్రప్రభ:
అచ్చంపేట మండల పరిధిలోని లింగోటం చెరువు సమీపంలోని చవటకుంటలో చేపలు భారీగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. కుంటలో చేపలు చనిపోయి తేలియాడుతుండటంతో మత్స్యకారులు, గ్రామ యువకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు విష ప్రయోగమే కారణమా లేక పట్టణం నుంచి వస్తున్న మురుగునీటి కలుషిత ప్రభావమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గ్రామ యువకుల కథనం ప్రకారం.. పట్టణ ప్రాంతం నుంచి వస్తున్న మురుగునీరు చవటకుంటలో కలుస్తుండటంతో నీరు కలుషితమై చేపలు ఊపిరాడక మృతి చెందిన అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు, కొందరు కావాలనే విష ప్రయోగం చేసి ఉండవచ్చనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. చేపల మృతితో తమ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ మురుగునీరు కుంటలోకి చేరకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు, యువకులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే చవటకుంటకు ముందు ఉన్న మల్లం కుంటలో కూడా ఇదే మురుగునీరు కలుస్తున్నప్పటికీ అక్కడ చేపలు చనిపోలేదని, మరి చవటకుంటలో మాత్రమే చేపల మృతి ఎలా జరిగిందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సంబంధిత శాఖ అధికారులు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి అసలు కారణాలను వెలికితీయాలని పలువురు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఘటన నేపథ్యంలో లింగోటం, వలపట్ల కాలనీల యువకుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిజానిజాలు వెల్లడించాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.