AP | భర్తే హత్య చేశాడని కుటుంబ సభ్యుల ఆరోపణ..
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం (పీటీఎం) మండలంలోని రాపూరివారిపల్లి పంచాయతీ కొత్తపల్లి సమీపంలో పద్మావతి అనే మహిళ దారుణహత్యకు గురైంది. ‘తల్లికి వందనం’ పథకం కింద వచ్చిన డబ్బుల విషయంలో తలెత్తిన కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మృతురాలి తల్లి కళావతి తెలిపిన వివరాల ప్రకారం… పథకం ద్వారా వచ్చిన డబ్బులు ఇవ్వలేదనే కారణంతో భర్త సురేష్ పద్మావతిని వేధించేవాడని ఆరోపించారు. చివరకు చిత్రహింసలకు గురిచేసి గొంతుకోసి హత్య చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలికి ప్రణీత్ (5వ తరగతి), విష్ణు (3వ తరగతి) అనే ఇద్దరు కుమారులున్నారు. ఈ ఘటనతో చిన్నారులు తల్లిని కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
సమాచారం అందుకున్న పెద్దతిప్పసముద్రం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది.
