కుప్పం, (ఆంధ్రప్రభ): కుప్పంలో జరుగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మ వారి జాతర సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు , సతీమణి నారా భువనేశ్వరి లు రాష్ట్ర ప్రభుత్వం,టిటిడి తరఫున అమ్మ వారికి పట్టు వస్త్రాలు, సారే సమర్పించారు. శ్రీ తిరుపతి ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి జాతర నిమిత్తం బుధవారం మధ్యాహ్నం కుప్పం కు విచ్చేసిన ముఖ్యమంత్రి దంపతులు అమ్మ వారిని దర్శించుకుని చల్లని తల్లి ఆశీస్సులు పొందారు.

కుప్పంలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాలలో చివరి ఘట్టమైన అమ్మ వారి విశ్వరూప దర్శనంతో చల్లని తల్లి కృపా కటాక్షాలు అందరిపై ఉండేలా అనుగ్రహిస్తున్నది. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి కి ప్రభుత్వ విప్, ఎం ఎల్ సి కంచర్ల శ్రీకాంత్,ఏ పి ఎస్ ఆర్ టి సి వైస్ ఛైర్మన్ పి ఎస్. మునిరత్నం,ఆలయ చైర్మన్ రవిచంద్రబాబు స్వాగతం పలికారు .ముఖ్యమంత్రి వెంట ముఖ్యమంత్రి కార్యదర్శి పి.ఎస్. ప్రద్యుమ్న, టిటిడి పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు,జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పి మణికంఠ చందోలు, కడ పిడి వికాస్ మర్మత్,టిటిడి పాలకమండల సభ్యులు వైద్యం శాంతారాం, కుప్పం మున్సిపల్ ఛైర్మన్ సెల్వం, నాయకులు డా.సురేష్ బాబు,రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.