జగ్గయ్యపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు విద్యార్థుల వెల్లువ..
రేగొండ, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లి మండలంలోని జగ్గయ్యపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల అత్యుత్తమ క్రమశిక్షణ, ఉత్తమ పరిపాలన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధనతో మండలంలో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, మండల స్థాయి ప్రథమ ర్యాంకును విద్యార్థిని వైష్ణవి సాధించి పాఠశాలకు మరింత పేరు ప్రతిష్ఠ తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా జగ్గయ్యపేట సర్పంచ్ నడిపెల్లి శాంతాదేవి-వెంకట్రావు, సుల్తాన్పూర్ సర్పంచ్. కాసెట్టి సక్కుబాయ్- రాజయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఒంటేరు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు గిరిధర కృష్ణ, తంగళ్ళపల్లి కుమారస్వామి తదితరులు కలిసి గ్రామాలలో ఇల్లు ఇల్లు తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులను కలుసుకొని ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న నాణ్యమైన విద్య, సదుపాయాలు, సంక్షేమ పథకాల గురించి వివరించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా సుమారు 12 మంది విద్యార్థులను ప్రత్యక్షంగా కలుసుకొని పాఠశాలలో చేరేందుకు ప్రోత్సహించారు. ఉపాధ్యాయుల సేవాభావం, పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విజయాలు చూసి తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఆకర్షితులై ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు.ప్రభుత్వ పాఠశాలలపై సమాజంలో విశ్వాసాన్ని పెంపొందించే దిశగా జగ్గయ్యపేట ఉన్నత పాఠశాల చేపడుతున్న ఈ వినూత్న కార్యక్రమం చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
