తలసేమియా కేంద్రానికి టీజీవీ గ్రూప్ నుంచి రూ. కోటి విరాళం.

తలసేమియా కేంద్రానికి టీజీవీ గ్రూప్ నుంచి రూ. కోటి విరాళం.

టీజీవీ భవన్ నిర్మాణానికి భూమిపూజ.
తొలి విడతగా రూ.25 లక్షల చెక్కు అందజేత.
కర్నూలు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నాం : మంత్రి టీజీ భరత్.

కర్నూలుబ్యూరో, ఆంధ్రప్రభ : రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కర్నూలులో ప్రత్యేక తలసేమియా కేంద్రం ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది. నగరంలోని బ్లడ్ బ్యాంక్ ఆవరణలో నిర్మించ తలపెట్టిన టి.జి.వి భవన్ తలసేమియా కేంద్రానికి టీజీవీ గ్రూప్ తరఫున రూ. కోటి విరాళాన్ని మంత్రి టీజీ భరత్ ప్రకటించారు. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.25 లక్షల చెక్కును రెడ్ క్రాస్ సొసైటీకి అందజేశారు. శనివారం జరిగిన కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సంయుక్తంగా భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలి ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు అభివృద్ధికి తమ కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమంగా తలసేమియా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దాదాపు రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ భవనాన్ని మూడు నెలల్లో పూర్తి చేయాలని నిర్వాహకులను కోరారు.

“కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలో”

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించే స్థాయికి తీసుకెళ్లేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. నాలెడ్జ్ సెంటర్ భవనం, మినరల్ వాటర్ ప్లాంట్లు, కళ్యాణ మండపాలు, క్రీడా ప్రాంగణాలు వంటి పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి నిస్వార్థ సేవా తత్వంతో ప్రజలకు సేవ చేస్తున్నారని కొనియాడారు.

మూడు రాష్ట్రాలకు ఉపయోగపడే కేంద్రం

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోనే అరుదుగా తలసేమియా కేంద్రం ఏర్పాటు కావడం శుభపరిణామమన్నారు. టీజీవీ కుటుంబ సహకారంతో నిర్మించనున్న 20 పడకల ఈ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రోగులకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. తలసేమియా బాధితులకు తరచూ రక్త మార్పిడి అవసరం ఉంటుందని, ఈ కేంద్రం ద్వారా వారికి నిరంతర వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందని తెలిపారు.

క్యాన్సర్ ఆసుపత్రికి రూ.9 లక్షల ఎంపీ నిధులు

మాజీ మంత్రి టీజీ వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కర్నూలు క్యాన్సర్ ఆసుపత్రికి అవసరమైన “మైక్రోటామ్” పరికరం కొనుగోలుకు ఎంపీ నిధుల నుంచి రూ.9 లక్షలు కేటాయిస్తున్నట్లు ఎంపీ బస్తిపాటి నాగరాజు ప్రకటించారు.

“రక్తదానం మహాదానం”

డీఎంహెచ్‌వో కామేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ రక్తదానం అత్యంత పవిత్రమైన సేవ అని పేర్కొన్నారు. ఒకసారి రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడినట్లేనని తెలిపారు. ప్రజలు అపోహలు విడనాడి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

రోగులకు ఊరటనిచ్చే కేంద్రం

రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, కెవి సుబ్బారెడ్డి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామచంద్రరావు మాట్లాడుతూ టీజీవీ భవన్‌లో ఏర్పాటు కానున్న తలసేమియా కేంద్రం వందలాది రోగులకు ఊరటనిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మంత్రి టీజీ భరత్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటనారాయణమ్మ, డీఎంహెచ్‌వో కామేశ్వర ప్రసాద్, వైద్యులు, రెడ్ క్రాస్ సభ్యులు, రక్తదాతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.