సుజ‌న పెళ్లి కానుక‌…మ‌ధుర జ్ఞాపిక‌

సుజ‌న పెళ్లి కానుక‌…మ‌ధుర జ్ఞాపిక‌

నూత‌న వ‌ధూవ‌రుల కోసం వినూత్న ప‌థ‌కం
సుజ‌న ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో బ‌హుమ‌తులు
చీర‌, ఫ్యాంటు ష‌ర్టు, స్వీట్ బాక్సు క‌లిపి గిఫ్ట్ బాక్స్
ఎమ్మెల్యే సుజ‌న చౌద‌రి శుభాకాంక్ష‌ల సందేశం
కొత్త జంట మోములో ఆనందాల ప‌ర‌వ‌శం

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ :కొంగొత్త ఆశ‌ల‌తో కొత్త జీవితంలోకి అడుగిడుతున్న శుభ వేళ‌..అందుకున్న కానుక మ‌ధుర జ్ఞాప‌కంగా నిలిచిపోతోంది. నూత‌న వ‌ధూవ‌రుల‌కు ప‌దికాలాలు గుర్తిండిపోయేలా పెళ్లి కానుక‌లు ఇస్తూ విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సుజ‌నా చౌద‌రి వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. నియోజ‌క‌వ‌ర్గంలో వివాహం చేసుకుంటున్న దంప‌తుల‌కు సుజ‌నా ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక బ‌హుమ‌తి అందిస్తూ వారిలో స‌రికొత్త ఆనందాన్ని నింపుతున్నారు. కొత్త ఆశ‌ల‌తో నూత‌న వైవాహిక జీవ‌తంలో అడుగిడుతున్న వేళ‌… అన్యోన్య దాంప‌త్యంతో ఆలుమ‌గ‌లు ప‌దికాలాలు చ‌ల్లాగా ఉండాల‌ని ఎమ్మ‌ల్యే సుజ‌నా చౌద‌రి ఆకాంక్షిస్తూ ప్ర‌త్యేకంగా రాసిన లేఖ కూడా ఆ బాక్సులో పొందుప‌ర‌చ‌డంతో నూత‌న జంట ఆనందాల‌కు హ‌ద్దే లేకుండా పోతోంది. త‌మకు స్వ‌యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి శుభాకాంక్ష‌లు చెప్ప‌డం ఎన‌లేని సంతోషం ఇస్తుందంటూ సంబ‌ర‌ప‌డుతున్నారు.

గిఫ్ట్ బాక్సులో ఉండేవి ఇవే…

సుజ‌నా ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో నూత‌న వ‌ధూవ‌రుల‌కు అంద‌జేసే గిఫ్ట్ బాక్సు చాలా ఆక‌ర్ష‌ణీయంగా రూపొందించారు. అందులో వ‌రుడికి ప్యాంటు ష‌ర్టు, వ‌ధువుకి చీర‌, స్వీట్ బాక్స్‌తో పాటు ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి ఫోటోతో కూడిన శుభాకాంక్ష‌ల కార్డు పొందుప‌రిచారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రైనా వారి శుభ‌లేఖ తీసుకువ‌చ్చి ఎమ్మెల్యే కార్యాల‌యంలో అంద‌జేస్తే వివాహం జ‌రిగే రోజు కార్యాల‌య ప్ర‌తినిధులు అక్క‌డ‌కు వెళ్లి ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి త‌ర‌ఫున నూత‌న జంట‌కు అంద‌జేసి వారికి ఆశీస్సులు అంద‌జేసి వ‌స్తారు.

ఆనందం వెలకట్టలేనిది…

కానుక అందుకున్న కొత్త జంట క‌ళ్ల‌ల్లో ఆనందం వెల‌క‌ట్ట‌లేనిదిగా ఉంటుంద‌ని కార్యాల‌య కార్య‌ద‌ర్శి ప్ర‌త్తిపాటి శ్రీ‌ధ‌ర్ ఈ సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌తినిధి అన్నారు. ఎమ్మెల్యే స్వ‌యంగా త‌మ‌కు కానుక అంద‌జేయ‌డం మ‌ధురానుభూతిని మిగుల్చుతుంద‌ని సంబ‌ర‌ప‌డుతుంతార‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఎంత‌మందికైనా ఇచ్చేందుకు కార్యాల‌యం సిద్ధంగా ఉంద‌ని చెప్పారు.