పెడనలో ఘనంగా గౌతు లచ్చన్న 20వ వర్ధంతి

పెడన, ఆంధ్రప్రభ : పెడన నియోజకవర్గం తోటమూలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 20వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ గౌతు లచ్చన్న అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటం చేశారని కొనియాడారు.
గౌతు లచ్చన్న (ఆగస్టు 16, 1909 – ఏప్రిల్ 19, 2006) భారతదేశంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ తర్వాత “సర్దార్” అనే గౌరవ బిరుదు పొందిన ప్రముఖ వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన సాహసం, కార్యదక్షతకు మెచ్చి ప్రజలే ఈ బిరుదును ప్రదానం చేశారని తెలిపారు. లచ్చన్న, వి.వి. గిరి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆచార్య ఎన్.జి. రంగా తదితర జాతీయ నాయకులతో కలిసి స్వాతంత్ర్య సమరంలో పాల్గొని అనేకసార్లు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు.
ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గాల్లో మంత్రి పదవులు నిర్వహించిన ఆయన, మద్యపాన నిషేధ అంశంపై ప్రకాశం పంతులతో విభేదించి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రభుత్వం పతనానికి కారణమయ్యారని చెప్పారు. ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూ స్వేచ్ఛ కోసం పోరాడిన గొప్ప నాయకుడు గౌతు లచ్చన్న అని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
