యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
మిల్లుల వద్ద ధాన్యం లారీల ఆలస్యం సహించం – కలెక్టర్ అనురాగ్ జయంతి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
రైస్ మిల్లులకు ధాన్యం లోడుతో వచ్చిన లారీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలపకుండా వెంటనే అన్లోడ్ చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.
గురువారం జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తో కలిసి చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం లోని మల్లికార్జున రైస్ మిల్లును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిల్లుకు రోజుకు ఎన్ని లారీలు వస్తున్నాయి, అన్లోడ్ చేయడానికి ఎంత సమయం పడుతుందనే విషయాలను ఆరా తీశారు. మిల్లుల్లో సరిపడా హమాలీలు లేకపోతే అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని, ఏ రోజు వచ్చిన లారీని ఆ రోజే అన్లోడ్ చేసి పంపాలని స్పష్టం చేశారు. మిల్లుల వద్ద వాహనాలు వేచి ఉండటం వల్ల రైతులకు ఇబ్బందులు కలగకూడదని ఆయన పేర్కొన్నారు.
అనంతరం చౌటుప్పల్ పట్టణంలోని మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న ధాన్యం కుప్పలను కలెక్టర్ బృందం పరిశీలించింది. మార్కెట్ యార్డులో ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్లు, ధాన్యం తేమ శాతం తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తేమ శాతం సరిగ్గా ఉన్న ధాన్యాన్ని వెంటనే కాంటా వేయాలని, తూకం వేసిన ధాన్యాన్ని నిల్వ ఉంచకుండా వెంటనే లారీల ద్వారా మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. రవాణాకు అవసరమైన లారీలను తగిన సంఖ్యలో ఏర్పాటు చేస్తామని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీవో వి శేఖర్ రెడ్డి, మండల తహసీల్దార్ వీరాబాయి, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి రవీందర్ రెడ్డి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
