పల్లెల్లో ‘ప్రాణాంతక’ రసాయన విషం
పల్లెల్లో ‘ప్రాణాంతక’ రసాయన విషం
- అంతమ్మగూడెంలో నిశ్శబ్ద మారణహోమం!
- కాలుష్యానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టిన బాధితులు
- మద్దతిస్తున్న పర్యావరణవేత్తలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : అపారమైన ప్రకృతి సంపదతో విరాజిల్లాల్సిన పల్లె సీమలు నేడు పారిశ్రామిక వ్యర్థాల కోరల్లో చిక్కి విలవిలలాడుతున్నాయి. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, బీబీనగర్, నల్లగొండ జిల్లా చిట్యాల మండలాలలోని వివిధ గ్రామాలలో విచ్చలవిడిగా నెలకొల్పిన రసాయన పరిశ్రమలు విడుదల చేస్తున్న వాయు, జల కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినడంతో పాటు పీల్చే గాలి, త్రాగే నీరు, తినే పంటలు, భూగర్భ జలాలు పూర్తిగా కాలుష్యం అవుతున్నాయి. ప్రధానంగా పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెం గ్రామం రసాయన కంపెనీల స్వార్థానికి బలవుతోంది.
గత ఎన్నో ఏళ్లుగా హజోలా రసాయన కంపెనీ విడుదల చేస్తున్న వ్యర్థాలు గ్రామస్తుల పాలిట యమపాశాలుగా మారాయి. భూగర్భంలోనూ విషమే! రసాయన పరిశ్రమలు వదులుతున్న వ్యర్థ రసాయనాలు భూమిలోకి ఇంకిపోవడంతో భూగర్భ జలాలు పూర్తిగా విషతుల్యమయ్యాయి. సుమారు 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అంతమ్మగూడెం గ్రామం మొత్తం ఈ రసాయన కాలుష్యంతో కలుషితమైంది. కాలుష్య కారక కంపెనీలను ఇప్పుడే మూసివేసినా, ఇక్కడి భూగర్భ జలాలు, నేల తిరిగి సాధారణ స్థితికి రావడానికి మరో 110 ఏళ్ల సమయం పడుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ప్రాణాలు తీస్తున్న ఫాస్జీన్ వాయువు వాయు కాలుష్యం కారణంగా పల్లెల్లో నిశ్శబ్ద యుద్ధం జరుగుతోందని ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కుంభం పురుషోత్తం రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీల నుండి విడుదలవుతున్న సుమారు 298 రకాల విషకారక వాయువులతో గాలి పూర్తిగా కలుషితమైంది. రెండో ప్రపంచ యుద్ధంలో శత్రువులపై ప్రయోగించిన ప్రాణాంతక ‘ఫాస్జీన్’ (Phosgene) వంటి వాయువును నేడు ఈ కంపెనీలు గాలిలోకి వదులుతున్నాయని, ఇది ప్రజల ప్రాణాలను హరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కాలుష్యం కేవలం పర్యావరణానికే పరిమితం కాకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కలుషితమైన గాలి పీల్చడం, నీరు తాగడం వల్ల గ్రామాల్లో ఎన్నడూ లేని విధంగా భయంకరమైన వ్యాధులు ప్రబలుతున్నాయి, క్యాన్సర్ కిడ్నీ వ్యాధులు, బ్రెయిన్ ట్యూమర్లు తదితర ప్రమాదకర జబ్బులు వస్తున్నాయి.
కాలుష్యం విముక్తి కోసం పోరుబాట అంతమ్మగూడెం గ్రామ పరిసరాలలో ఉన్న కాలుష్య కారక రసాయన పరిశ్రమలను తక్షణమే మూసివేయాలని, కాలుష్యం వల్ల పంట పొలాలు కోల్పోయిన రైతులకు, అనారోగ్యం బారిన పడిన బాధితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని, అభివృద్ధి పేరుతో వెలుస్తున్న పరిశ్రమలు ప్రజల జీవన హక్కును హరించేవిగా ఉండకూడదు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అంతమ్మగూడెం లాంటి గ్రామాలను కాలుష్యం కోరల నుండి రక్షించాలని డిమాండ్ చేస్తూ అంతమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి గౌరవాధ్యక్షులు గుమ్మి నరేందర్ రెడ్డి, అధ్యక్షులు గుమ్మి దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వస్పరి ప్రభ, ఉపాధ్యక్షులు రావుల రాంరెడ్డి, రేణుక, గుర్రం రామచంద్ర రెడ్డి, కాలుష్య బాధితుడు రావుల శశికిరణ్ లు కాలుష్యం బాధితులతో కలిసి పోరుబాట పట్టారు.
కాలుష్యానికి వ్యతిరేకంగా, అధికారుల తీరుకు నిరసనగా బాధితులు ఉదయం నుండి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేశారు. అధికారులు స్పందించకపోతే తాము చేపట్టిన ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. త్వరలో జిల్లా కలెక్టర్ కార్యాలయంను, పీసీబీ జిల్లా, రాష్ట్ర కార్యాలయాలను ముట్టడించేందుకు కాలుష్యం బాధితులు సిద్ధమవుతున్నట్లుగా వారు పేర్కొంటున్నారు.
